తేదేపా అన్‌స్టాపబుల్‌.. బుల్లెట్ లా దూసుకుపోతుంది: చంద్రబాబు

Chandra Babu Naidu Meeting

తేదేపా అన్‌స్టాపబుల్‌.. బుల్లెట్ లా దూసుకుపోతుంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో తన సభలకు వచ్చి చూస్తే తెలుస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandra Babu) స్పష్టం చేశారు. డ్రోన్‌ షూటింగ్‌లు అంటూ అవాకులు చవాకులు పేలుతున్న జగన్‌రెడ్డి.. సభకు వచ్చి వాస్తవాలు చూడాలని ధ్వజమెత్తారు. బిడ్డల భవిష్యత్తుకు ఐటీ అనే ఆయుధాన్ని తానిస్తే.. భస్మాసుర అస్త్రం సైకో ఇస్తున్నాడని మండిపడ్డారు. ఇంకా ఉపేక్షిస్తే పూర్తిగా నాశనమవుతామన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి ప్రజల్ని మనుషుల్లా చూడకుండా బానిసల్లా చూస్తున్నారని ఆరోపించారు.

నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం జనసంద్రమైంది. బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దేశానికి ఓ గొప్ప నాయకుడ్ని అందించిన ప్రధానమంత్రి తల్లి చనిపోవడం బాధాకరమని, ఆ మాతృమూర్తికి కోవూరు సభ ద్వారా నివాళులర్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఆవు చేలో మేస్తే.. సామెత లెక్క జగన్మోహన్ రెడ్డి దోపిడీకి తగ్గట్టే ఎమ్మెల్యేల అవినీతి ఉందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎవరైనా లే అవుట్ వేయాలంటే ఎకరాకు రూ.10లక్షల చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోతే కనీసం వారివైపు చూడని మంత్రి జిల్లాలో ఉన్నారని ఆరోపించారు. తనపై అనవసరంగా నోరు పారేసుకునే ముందు రైతులకు మంత్రిగా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అన్‌స్టాపబుల్‌.. రాష్ట్ర భవిష్యత్తు కోసం బుల్లెట్ లా దూసుకుపోతుందని తేల్చి చెప్పారు.

భవిష్యత్తు తరాల సంపద అంతా జగన్‌ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకుంటూ పైకి తీసుకోస్తామని హామీ ఇచ్చారు. యానాదుల జీవితాల్లో వెలుగులు రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని సీఎం జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి కొంపలు కూల్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు.

Share this Article
Leave a comment