Rameswaram Cafe Success Story: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే పదానికి ట్రెండీ ఎగ్జాంపుల్ కావాలంటే.. బెంగుళూరులో ఉన్న రామేశ్వరం కేఫ్ టిఫెన్ సెంటర్‌ను చూపించొచ్చు. 24/7 కస్టమర్లతో కళకళ.. గల్లాపెట్టె గలగలా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి! అనతి కాలంలోనే ఎంత ఎదిగిందంటే.. రాష్ట్రం, దేశం సరిహద్దులు కూడా దాటించి.. విదేశాలలో బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు చూస్తున్నారు.
అహ్మదాబాద్ IIMలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసి, అడిషనల్ క్వాలిఫికేషన్ గా CA చదివి.. ఉడిపి హోటల్లో గరిట పట్టుకునేందుకు సిద్ధమైంది దివ్యారాఘవేంద్ర. ఫుడ్ ఫ్యాక్టరీలో 15ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న రాఘవేంద్రతో చేయి కలిపింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ.. ముందు స్నేహితులయ్యారు. ఆ తర్వాత బిజినెస్& లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ ప్రపంచాన్ని దున్నేస్తున్నారు. కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరు మీద ‘రామేశ్వరం కేఫ్’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్‌లను 2021లో ప్రారంభించారు.
రామేశ్వరం కేఫ్ (Rameswaram Cafe) దూసుకుపోతున్న తీరు.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిఫెన్ సెంటర్ మీద ఆదాయమంటే నెలకు ఓ “లకారం” వేసుకోండి! అంతేగానీ లక్షలు దాటి కోట్ల రూపాయల ఆదాయం ఏంది సామీ! అన్నది జనాల మాట. ఈ రెస్టారెంట్ నెలకు దాదాపుగా రూ.4.5 కోట్లు ఆర్జిస్తోందట. అంటే.. సంవత్సరానికి ఏకంగా 50 కోట్ల పైమాటే!. ఫేమస్ టీవీ షో “మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా”లోని జడ్జీలలో ఒకరైన ప్రముఖ చెఫ్ గ్యారీ మెహిగాన్ కూడా రామేశ్వరం కేఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను తిన్న దోశ గురించి ఒక వీడియోను షేర్ చేయడంతో.. ఈ కేఫ్ మరింతగా వైరల్ అయ్యింది.
ఒక బిజినెస్ ఈ స్థాయిలో డెవలప్ కావడానికి ఏళ్లు పడుతుంది. కానీ.. రామేశ్వరం కేఫ్ వయసు కేవలం రెండేళ్లే! 2021లో ఈ కేఫ్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. తమదైన క్వాలిటీ.. టేస్ట్‌తో అనతి కలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని సాధించారు. ఇంకేముంది? జనాలు దారికట్టడం మొదలు పెట్టారు. దీంతో.. నిర్వాహకులు క్రమంగా ఔట్లెట్లను విస్తరించడం మొదలు పెట్టారు. దోశ, ఇడ్లీ, వడ అంటూ.. సౌత్ ఇండియా డిషెస్ మొత్తం లభిస్తాయిక్కడ. ఈ కేఫ్‌లో దాదాపు 200 మందికి పైగా పనిచేస్తుంటారు. రామేశ్వరం కేఫ్ పేరు మార్మోగుతుండడంతో.. సాధ్యమైనన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ శాఖలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
/Web Stories/