రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు.. నగరంలోకి వెళ్ళేవారు తప్పకుండా పాటించాల్సిందే

admin
By admin 1 View
3 Min Read

విశాఖ నగరంలోని డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం (Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium)లో ఈ నెల 19న ఆదివారం భారత్‌, ఆసీస్‌ (Ind vs Aus) మధ్య జరగనున్న రెండో వన్డే సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి విశాఖలోకి

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం నుంచి విశాఖలోకి వచ్చే భారీ వాహనాలు, బస్సులను మారికవలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్‌ కూడలి మీదుగా తిమ్మాపురం చేరుకుని, కుడివైపు తిరిగి బీచ్‌రోడ్డు మీదుగా వెళ్లాలి. చిన్నవాహనాలైన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కార్‌షెడ్‌ నుంచి మిథిలాపురం కాలనీ మీదుగా ఎంవీవీ సీటీ వెనుకగా వెళ్లి, లా కళాశాల రోడ్డు, పనోరమహిల్స్‌, రుషికొండ మీదుగా జాతీయ రహదారి చేరుకుని నగరంలోకి వెళ్లాలి.

విశాఖ నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు

విశాఖ నగరం నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే భారీ వాహనాలు, బస్సులను హనుమంతవాక వద్ద ఎడమవైపునకు తిరిగి ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రహదారి మీదుగా అడవివరం కూడలి నుంచి కుడివైపునకు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్లాలి. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు హనుమంతవాక కూడలి వద్ద ఎడమవైపు బీఆర్‌టీఎస్‌ రోడ్డులో అడవివరం వెళ్లి అక్కడ నుంచి ఆనందపురం చేరుకోవాలి. హనుమంతవాక, విశాఖ వ్యాలీ, ఎండాడ కూడలి వద్ద కుడివైపు తిరిగి బీచ్‌రోడ్డు చేరుకుని తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి మారికవలస జాతీయ రహదారిపైకి చేరుకోవాలి.

రేపు ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఎలాంటి భారీ వాహనాలకు మధురవాడ స్టేడియం వైపు అనుమతులు లేవు. అనకాపల్లి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం చేరుకోవాలి. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు నగరంలోకి రాకుండా ఆనందపురం నుంచి పెందుర్తి, సబ్బవరం మీదుగా వెళ్లాలి.

- Advertisement -

(Ind vs Aus) పార్కింగ్‌ ప్రదేశాలివే..

  • విశాఖ నగరం నుంచి స్టేడియానికి వచ్చే వి.వి.ఐ.పి, వి.ఐ.పి వాహనాలు స్టేడియం వరకు వచ్చి ఏ, బీ, వీ కన్వెన్షన్‌ మైదానంలో వారి పాస్‌ల ప్రకారం చేరుకోవాలి.
  • సిటీ నుంచి స్టేడియం వచ్చే సాధారణ టిక్కెట్‌ దారులు స్టేడియం వద్ద ఉన్న వృద్ధాశ్రమ కూడలి వద్ద ఎడమవైపు తిరిగి, సాంకేతిక ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో పార్కింగ్‌ చేసుకోవాలి. సాంకేతిక మైదానంలో ఆన్‌లైన్‌ టికెట్లను ఒరిజనల్‌ టికెట్లుగా మార్చుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
  • శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుంచి వచ్చే వారు కారుషెడ్‌ కూడలి కుడివైపు తిరిగి సాంకేతిక ఇంజినీరింగ్‌ కళాశాలలో పార్కింగ్‌ చేసుకోవాలి. సరిపోకపోతే కార్‌షెడ్‌ కూడలి నుంచి ఎడమవైపు తిరిగి మిథిలాపురం కాలనీ మీదుగా ఎంవీవీ సీటీ డబుల్‌రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు మైదానంలో పార్కింగ్‌ చేసుకోవాలి.
  • సిటీ, భీమిలి నుంచి బీచ్‌ రోడ్డు మీదుగా వచ్చేవారు ఐటీ సెజ్‌ గుండా వచ్చి ఎంవీవీ సిటీ డబుల్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసుకోవాలి. ఈదారి గుండా ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో వచ్చేవారు ఐటీ సెజ్‌ మీదుగా లా కళాశాల మైదానంలో పార్కింగ్‌ చేసుకోవాలి.
  • శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం మీదుగా వచ్చే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మారికవలస, తిమ్మాపురం, ఐటి సెజ్‌ మీదుగా లా కళాశాల రోడ్డు చేరుకుని పార్కింగ్‌ చేసుకోవాలి.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *