విశాఖ: ఈమేకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. నాలుగేళ్ల జీతం దాచి తమ గ్రామానికి రోడ్దేసిన మహిళ

alluri sitarama raju district

విశాఖపట్నం: రూపాయి.. రూపాయి పోగేసి దాచుకున్న మొత్తాన్ని ఒకేసారి సొంత పనులకు ఖర్చు చేయాలంటేనే మనలో చాలామందికి మనసొప్పదు. ఇన్నేళ్ల పొదుపును ఖర్చు చేస్తున్నామని తెగబాధపడిపోతుంటాం. కానీ.. ఓ మహిళ సొంతిల్లు కట్టుకోవాలని నాలుగేళ్ల పాటు పైసా పైసా కూడబెట్టినసొమ్ముును ఊరిజనం కోసం ఖర్చుచేసిందంటే నమ్ముతారా. అలాగని ఆవిడేమీ శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు టైపు కూడా కాదు.. జస్ట్ ఓ సామాన్య ఆరోగ్య కార్యకర్త. బహుశా జీతం కూడా నెలకు పదివేల లోపే ఉండొచ్చు.

పైన మొదటి ఫోటోలో చంటిబిడ్డను ఎత్తుకుని ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు జమ్మె. అల్లూరి సీతారామరాజు (alluri sitarama raju) జిల్లా ముంచింగిపుట్టు మండలం జోలవుట్ పంచాయతీ పరిధిలోని తోటగొడిపుట్టు గ్రామానికి చెందిన ఈమె ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ ఉంటారు. జమ్మె వాళ్ల ఊరు జోలాపుట్టు రిజర్వాయర్ పరిసర ప్రాంతంలో ఉంది. చుట్టూ కొండప్రాంతం. బయట ఊర్లకి వెళ్లాలంటే మూడు కిలోమీటర్ల దూరాన్ని కొండ పక్కన రాళ్లగట్టు వెంబడి నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. దీంతో బయటిప్రాంతాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లు ఆ ఊరిజనం. ఆస్పత్రులకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితుల్లో వారి కష్టాలు ఆ దేవుడికే ఎరుక. ఆరోగ్య కార్యకర్తగా ఇవన్నీ కళ్లారా చూసిన జమ్మె.. ఊరికోసం ఏదైనా చేయాలని అనుకుంది. రహదారిని నిర్మించి సొంతూరి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

రోడ్డు నిర్మాణం కోసం సొంతింటికై నాలుగేళ్లపాటు దాచిన తన జీతాన్ని ఉపయోగించారు జమ్మె. గంటకు 13 వందల 50 రూపాయల లెక్కన జేసీబీని అద్దెకు తీసుకుని మట్టిరోడ్డు వేయించారు. రోజుకు 16 వేల లెక్కన ఖర్చుచేసి సొంత ఊరిజనం కోసం రోడ్డు వేయించారు. తమ ఊరిజనం ఆరోగ్యంగా ఉండాలనేదే తన కోరికంటున్న జమ్మె.. అనారోగ్యానికి గురైతే సకాలంలో ఆరోగ్య కేంద్రాలకు వెళ్లటం అవసమరని అన్నారు. అందుకే రోడ్డు వేయించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అయితే అవి పునర్జన్మకు సంబంధించినవే.. స్వప్న శాస్త్రం ఏం చెబుతందంటే?

ఈ ఊరు మొత్తం కొండ ప్రాంతంలో ఉంది.. వీరు బయట ఊర్లకు వెళ్లాలంటే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇక ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయం పట్టేది. ఈ కష్టాలన్నీ స్వయంగా చూసిన ఆరోగ్య కార్యకర్త జమ్మె ఈ నిర్ణయం తీసుకున్నారు. తన జీతం డబ్బుల్ని ఊరి రోడ్డు కోసం ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె మంచి మనసును స్థానికులు అభినందించారు. ఊరి కోసం తనవంతుగా సాయం చేసిన ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా జెమ్మి చేసిన గొప్ప పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Share this Article
Leave a comment