యాత్రికులకు ఆధునిక వసతులు.. ప్రసాద్‌ పథకం కింద సింహాచలంలో పనులు

Simhachalam Temple

Simhachalam: సింహాచలం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.54.04 కోట్ల నిధులకు సంబంధించి పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సమర్పించారు. రెండేళ్ల కిందట దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపగా ఎట్టకేలకు అనుమతులు లభించాయి. కేంద్ర పర్యాటక శాఖ సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్‌’ (తీర్థయాత్రా స్థలాల నవీకరణ, ఆధ్యాత్మిక పెంపుదల) పథకానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కొండపైన, కింద ఏరకమైన పనులు చేపట్టాలో పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఇంజినీరింగ్‌ అధికారులకు మార్గదర్శకాలు వచ్చాయి.

చేపట్టనున్న పనులిలా..:

ప్రసాద్‌ పథకం కింద కొండపైన, కింద భక్తుల అవసరార్థం పాత పుష్కరిణి ఘాట్‌ వద్ద రెండు బ్లాకులు నిర్మించాలని ప్రతిపాదించగా దానికి అనుమతించారు. కొండ మీదకు వెళ్లే పాత ప్రవేశ మార్గాన్ని ఆధునికీకరించనున్నారు. కొండ మీదకు వెళ్లే మార్గంలో మధ్యమధ్యలో తోరణాలు, ఆధునిక విద్యుత్తు దీపాలు వేయనున్నారు. కొండ పైనుంచి అందాలు వీక్షించేందుకు వీలుగా పలు చోట్ల వీక్షణ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బల్లలు, భక్తుల కోసం తాగునీటి సౌకర్యాలు కల్పిస్తారు. కొండ మీద సందర్శకుల కోసం ఆంఫీ థియేటర్‌ నిర్మిస్తారు. భక్తుల దర్శనాలకు వీలుగా శాశ్వతంగా ఉండిపోయేలా ఆధునిక క్యూ కాంప్లెక్సు రానుంది. ప్రత్యేకంగా యజ్ఞశాల ఒకటి నిర్మించనున్నారు. ఎండ, వానల నుంచి రక్షణగా పైకప్పులు రానున్నాయి. ప్రజల అవసరాల కోసం ఏటీఎం కేంద్రాలు, సామగ్రి, సెల్‌ఫోన్లు భద్రపరుచుకునే గదులు ఏర్పాటు చేస్తారు.

నాలుగు ఎకరాల్లో..:

కొత్త ఘాట్‌ రోడ్డు వద్ద ఖాళీగా ఉన్న నాలుగు ఎకరాల స్థలంలో భక్తుల కోసం కొత్తగా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందులో అన్ని రకాల వసతులు రానున్నాయి. ప్రధానంగా బస్సు షెల్టర్‌, మరుగుదొడ్లు, ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మించనున్నారు. కార్లు, దిచక్రవాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. వంటశాల ఆధునికీకరణ: ప్రస్తుతం భక్తులకు అన్నదానం, ఇతర ప్రసాదాల తయారీ సాధారణ పద్ధతుల్లో జరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువమందికి వండేందుకు వీలుగా ఆధునిక యంత్రాలతో చేపట్టే వంటశాలను తీసుకురానున్నారు. శీతల గోదాంను అందుబాటులోకి తేనున్నారు. సరకు రవాణాకు అవసరమైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇవే కాకుండా 14 టైర్లతో నడిచే విద్యుత్తు వాహనాన్ని సమకూర్చనున్నారు. బహుళ అవసరాలకు వినియోగించే ఒక భవన సముదాయాన్ని కొండ మీద నిర్మించనున్నారు.

ఏమైనా మార్పులు ఉంటాయా?: కొద్ది రోజుల కిందట దేవాదాయ శాఖ మంత్రి దేవస్థానం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రసాద్‌ పథకం సమగ్ర ప్రాజెక్టు వివరాలు (డీపీఆర్‌) గురించి ఆరా తీశారు. దాన్ని ఎవరు తయారు చేశారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందులో కొన్ని మార్పులు చేపడితే బాగుంటుందని చర్చించారు. ప్రస్తుత వసతులతో పాటు భక్తుల వసతి కోసం డీలక్స్‌ గదులు వంటివి నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశారు. మరికొన్ని ప్రతిపాదనలకు సంబంధించిన పనులు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డీపీఆర్‌లో కొన్ని మార్పులు ఉండొచ్చంటున్నారు.

Share this Article
Leave a comment