విశాఖపట్నం/land grabbing: పద్మనాభం (padmanabham) మండలంలో జగనన్న కాలనీలకు అవసరమైన భూసమీకరణలో జరిగిన గోల్‌మాల్‌పై జిల్లా యంత్రాంగం స్పందించింది. మండలంలో భూ అక్రమణాలు (land grabbing) జరిగాయంటూ వస్తున్న వార్త కథనాలపై జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ స్పందించారు. భూసమీకరణకు సంబంధించి రికార్డులు తీసుకుని రావాలని మండల అధికారులను ఆదేశించారు. శుక్ర లేదా శనివారం తహసీల్దార్, డీటీ, సర్వేయర్, వీఆర్వోలు రికార్డులతో జేసీ వద్దకు రానున్నారు. పద్మనాభం (padmanabham) మండలంలో ప్రధానంగా నరసాపురం, రెడ్డిపల్లి, గంధవరం, కొవ్వాడ గ్రామాల్లో కొంతమంది నేతలు, వారి బినామీల పేర్లను అధికారులు భూములు ఇచ్చిన వారి జాబితాలో చేర్చారని గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణలు తెలిసిందే. ఇంకా రైతులు ఇచ్చిన దానికంటే తక్కువ విస్తీర్ణం చూపించి, మిగతాది అధికార పార్టీ నేతల పేరిట నమోదుచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన కుటుంబీకులకు తునివలసలో ప్రధాన రహదారికి ఆనుకుని ప్లాట్లు కేటాయింపులో పద్మనాభం తహసీల్దార్ కార్యాలయ అధికారులు, కొందరు సిబ్బంది పాత్ర వున్నట్టు ఫిర్యాదులు రావడంతో పూర్తిస్థాయి విచారణకు జేసీ నిర్ణయించారు.