మండపంలో బాలయ్య ఉంటేనే పెళ్లి పీటలెక్కుతా!: విశాఖలో వీరాభిమాని

Balayya Abhimani Wedding

 Balayya Abhimani wedding: విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలోని చింతల అగ్రహారానికి చెందిన కోమలి పెద్ది నాయుడు కుటుంబమంతా నందమూరి కుటుంబానికి వీరభిమానులు. పెద్ది నాయుడు చిన్నప్పటీ నుంచి నందమూరి బాలకృష్ణకు పిచ్చి అభిమాని. బాలయ్య కొత్త సినిమా ఎప్పుడు విడుదలైన సినిమా థియేటర్ల ముందు భారీ కటౌట్లను ఏర్పాటు చేసి, తన అభిమానాన్ని చాటుకునేవారు. ఈ క్రమంలో 2019వ సంవత్సరంలో పెద్ది నాయుడుకి గౌతమీ ప్రియ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమవ్వగా.. అదే ఏడాది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. అయితే, అదే ఏడాదిలోనే పెళ్లి కూడా నిర్ణయించారు. కానీ, తన పెళ్లికి టాలీవుడ్ నటసింహాం నందమూరి బాలకృష్ణ ( Balayya Abhimani wedding) వస్తేనే పెళ్లి చేసుకుంటానని కోమలి పెద్ది నాయుడు బంధువులకు తెలియజేశాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా ఆయనకు ఆహ్వానం పంపారు. కానీ, ఆయన రాకపోవడంతో పెద్ది నాయుడు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. రెండున్నరేళ్లుగా బాలయ్య కోసం ఎదురుచూసిన అభిమాని.. తాజాగా ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తానికి నందమూరి బాలకృష్ణ విచ్చేసి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నారు. 

ఊరంతా బాలయ్య ప్లెక్సీలు, కటౌట్లు: బాలకృష్ణ తన పెళ్లికి రావాలని కోరుతూ.. వేపగుంట కూడలి నుంచి చింతల అగ్రహారం పెళ్లి పందిరి వరకు మూడు కిలోమీటర్ల పొడువునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెద్ది నాయుడు కోరికకు మద్దతుగా నిలిచిన ఆ గ్రామ ప్రజలు, అమ్మాయి తరుపు బంధువులు.. బాలకృష్ణ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు, ఊరు ఊరంతా బాలకృష్ణ పెళ్లికి రావాలని, ఆ నూతన వధువరూలను ఆశీర్వదించాలని ప్రార్థిసున్నారు. స్వాగత బోర్డులు, ఫ్లెక్సీలు కట్టి ఊరు ఊరంతూ బాలకృష్ణకు స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా పెళ్లి కొడుకు పెద్ది నాయుడు మాట్లాడుతూ..”నా చిన్నతనం నుంచి నేను బాలకృష్ణ సినిమాలు చూసి పెరిగాను. బాలయ్య బాబును స్ఫూర్తిగా తీసుకుని ఆర్థికంగా స్థిరపడ్డాను. అందుకే నా పెళ్లి బాలయ్య బాబు ఆశీస్సులతో జరగాలని నిశ్చయించుకున్నాను. నా కోరికకు నా బంధువులు, మా ఊరి ప్రజలు కూడా మద్దతిచ్చారు. రెండున్నరేళ్లుగా బాలయ్య రాక కోసం వేచి చూసి.. మార్చి 11వ తేదీ రాత్రి నా వివాహ ముహూర్తాన్ని పెట్టుకున్నాను. ఆ ముహూర్త శుభలేఖను బాలకృష్ణ అభిమాన సంఘం, బాలకృష్ణ అల్లుడు గీతం కాలేజీ అధ్యక్షుడు ఎం. భరత్‌కు అందజేసి.. నా పెళ్ళికి బాలయ్య బాబును ముఖ్య అతిథిగా రప్పించాలని వేడుకున్నాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. దాంతో ఊరంతా స్వాగత బోర్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాను. బంధువులు, ఊళ్ళో పెద్దలు, గ్రామస్తులు అంతా ఇప్పుడు సినీ నటుడు బాలకృష్ణ రాక కోసం ఎదురుచూస్తున్నారు” అని వెల్లిడించారు.

Share this Article
Leave a comment