జూ సమీపంలో అగ్నికి ఆహుతైన ఆడీ కారు

విశాఖపట్నం: జూపార్కు సాగరతీరం సమీపంలో గురువారం రాత్రి ఖరీదైన ఓ కారు దగ్ధమైంది (Fire Accident). ఎండాడలో ఉంటున్న సతీష్‌ తన ఆడి కారును మరమ్మతుల నిమిత్తం సాగర్‌నగర్‌ సమీప ఓ మెకానిక్‌ షెడ్డుకు ఇచ్చారు. వాహనానికి సంబంధించిన ఏసీ తదితర విభాగాల మరమ్మతుల ప్రక్రియను నగరంలో పూర్తి చేయించి యజమానికి అప్పగించేందుకు మెకానిక్‌ షెడ్డుకు చెందిన ఓ వ్యక్తి కారును తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో మంటలు రేగిన విషయాన్ని ఓ ద్విచక్రవాహనదారుడు అప్రమతం చేయగా డ్రైవర్‌ క్షణాల్లో బయటకు వచ్చి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జూ సమీప ప్రదేశంలో ఈ ఘటన జరగడం, దట్టమైన పొగ వ్యాపించడం, అక్కడే విద్యుత్తు స్తంభాలు ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆరిలోవ పోలీసులు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పైర్ ఇంజన్ వచ్చేటప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

Share this Article
Leave a comment