పెళ్లి కావట్లేదని యువకుని ఆవేదన.. కన్యా భాగ్య పథకం ప్రవేశ పెట్టాలని అధికారులకు లేఖ

ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలోనే జరగాలనే నానుడి ఈ యువకుడి మదిలో బాగా పాతుకుపోయినట్లుంది. నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నా ఆ యువకుడికి పెళ్లి (Marriage) కావడం లేదట. దాంతో అతనికి పెళ్లి మీద బెంగ పట్టేసుకుంది. మూడు పదులకు దగ్గర్లో ఉన్న యువకుడు ఆలస్యం చేయకుండా కన్య భాగ్య పథకాన్ని (Kanya Bhagya scheme) ప్రవేశ పెట్టి.. తనకి పెళ్లి చేయాలని అధికారులకు వినతి పత్రం సమర్పించుకున్నాడు.

కర్ణాటక (Karnataka) గదగ్ జిల్లా డంబరిగికి చెందిన ముత్తు నాగరాజ్ హుగార్ వయసు 28 ఏళ్లు. కాంట్రాక్టర్ వృత్తి చేస్తూ నెలకు రూ.50 వేలు జీతం సంపాదిస్తున్నాడు. చూడటానికి బాగానే ఉంటాడు. కుల, మత పట్టింపులు లేవు. అర్ధం చేసుకుంటే చాలు. వివరాలు అన్నీ బాగానే ఉన్నాయి.. పెళ్లి సంబంధం కోసమా? అనుకుంటున్నారు కదా.. ప్రొఫైల్ ఇంత బాగున్నా పాపం అతనికి పెళ్లి కుదరట్లేదు. ఎన్ని సంబంధాలు చూసిన సెట్ అవ్వట్లేదు. దాంతో అతను బెంగ పెట్టేసుకున్నాడు. ముఫ్పైలో పడితే అసలు పెళ్లే కాదనుకున్నాడేమో? ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి వినతి పత్రం రాసేసాడు. ‘కన్య భాగ్య పథకం’ ప్రవేశ పెట్టాలంటూ అధికారులకు వినతి పత్రం ఇచ్చాడు

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ భాగ్య, గృహలక్ష్మీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటివి అమలు చేస్తోంది. అలాగే తన లాంటి పెళ్లి కాని యువకుల కోసం ‘కన్య భాగ్య పథకం’ ((Kanya Bhagya scheme)) ప్రవేశపెట్టాలని ముత్తు హుగార్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం లేని కారణంగా తనను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావట్లేదని అతను వాపోతున్నాడు. ఇక ఇతని లేఖ చూసి స్ధానికులు, వినతి పత్రం తీసుకున్న అధికారులు సైతం నోరెళ్ల బెట్టినా అతని సమస్యను పై అధికారులకు విన్నవిస్తామని చెప్పి తిప్పి పంపారు.

గతంలో రైతులు తమకు ఎవరూ పెళ్లి చేసుకునేందుకు పిల్లని ఇవ్వట్లేదని ఆవేదన చెందిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలిస్తే రైతుని పెళ్లి చేసుకున్న యువతులకు రూ. 2 లక్షలు బహుమతిగా ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ( kumara swamy)ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న రైతులు, యువకుల సమస్యను పట్టించుకోవాలని ముత్తు లాంటి వారు కోరుతున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుత సమాజంలో ఇది ముత్తు ఒక్కడి సమస్యే కాదు. చాలామంది యువకుల మనసులోని మాట కూడా. ముత్తు ఓ అడుగు ముందేసి బయటకు చెప్పేసాడు అంతే. దీనికో సొల్యూషన్ వస్తే చాలామంది పెళ్లికాని యువకులకు న్యాయం జరుగుతుందేమో.

Share this Article
Leave a comment