ఆంధ్రప్రదేశ్: రాగిజావ (Ragi Malt) తీసుకోవడానికి విద్యార్థులు ఇంటి నుంచి గ్లాసులను తెచ్చుకోవాలని విద్యాశాఖ సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లోనే గ్లాసుల్ని అందుబాటులో ఉంచుతామని తెలిపింది. రాగిపిండి అందుబాటులో లేదని ఒకసారి, ఎన్నికల నియమావళి పేరుతో మరోసారి రాగిజావ (Ragi Malt) కార్యక్రమాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం ఈ నెల 21 నుంచి అమలు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్లాసుల కొనుగోలుకు టెండర్లు పిలిచినప్పటికీ సరఫరాకు నెల వరకు పట్టే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు వారి గ్లాసులను తెచ్చుకునేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అధికారులకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. గ్లాసులు తెచ్చుకోని విద్యార్థులకు జావ ఇవ్వకుండా ఉండొద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 38 లక్షల మంది విద్యార్థులకు వారానికి మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ అందిస్తారు. దీనికి అవసరమైన రాగిపిండి, బెల్లాన్ని శ్రీసత్యసాయి ట్రస్ట్ ఉచితంగా అందిస్తోంది.