PM Surya Ghar: కేంద్రం ఉచిత విద్యుత్‌ పథకం.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం దరఖాస్తు చేసుకోండి

admin
By admin 512 Views
3 Min Read

Solar Rooftop Scheme: దాదాపు కోటి ఇళ్లకు ఫ్రీ కరెంట్ అందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్కీమ్.. పీఎం సూర్య్‌ఘర్- ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar Muft Bijli Yojana) . దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది. సబ్సిడీ కూడా వస్తుంది. ఇలా సౌర విద్యుత్ వాడితే 300 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ పడదు. ఈ పథకం 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు అందుబాటులో ఉంటుంది. ఈ స్కీంకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపి రూ. 75,021 కోట్లు కేటాయించింది. ఇక ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి. రాయితీ ఎంత వస్తుంది.. ఎలా వస్తుంది చూద్దాం.

పీఎం సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం (PM Surya Ghar Muft Bijli Yojana) కింద రాయితీని రెండు భాగాలుగా విభజించి కేంద్రం ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపో రేటుకు 0.50 శాతం అదనంగా వసూలు చేయనుండగా.. ప్రస్తుతం ఇది 7 శాతంగా ఉంది. అంటే చాలా తక్కువ వడ్డీనే అని అర్థం చేసుకోవచ్చు.

కరెంట్‌ అమ్ముకోవచ్చు..
ఈ స్కీంలో భాగంగా ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో మొదటి 300 యూనిట్లు లబ్ధిదారు ఉచితంగా వాడుకోవచ్చు. మిగతా 600 యూనిట్లను నెట్ మీటరింగ్‌తో అమ్ముకోవచ్చు. నెలకు దాదాపు దీని ద్వారా రూ. 1265 ఆదాయం వస్తుంది. రూ. 610 ని బ్యాంక్ రుణవాయిదా కింద జమ చేసుకుంటుంది. దీని కింద ఏడేళ్లలో ఆ రుణం కూడా తీరిపోనుంది.

ఎవరికి ఎంత కెపాసిటీ
నెలకు 0-150 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూర్యఘర్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 150-300 యూనిట్లు చొప్పున వినియోగించే వారు 2-3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్లకు పైబడి విద్యుత్‌ను వినియోగించే వారు 3 కిలోవాట్‌, ఆ పైబడి సామర్థ్యం కలిగిన సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. 3 కిలోవాట్లకు మించి సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా గరిష్ఠంగా రూ.78వేలు మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి.. సబ్సిడీ ఎలా వస్తుంది?
ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే.. తొలుత https://pmsuryaghar.gov.in/ పోర్టల్‌లో అప్లై దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. దీని కోసం మీ రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. విద్యుత్ కనెక్షన్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
రెండో స్టెప్‌లో కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. అక్కడే రూఫ్‌టాప్ సోలార్ పథకం కోసం అప్లై చేసుకోవాలి.

అప్లై చేశాక.. డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాక.. మీ డిస్కమ్‌లోని రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాలేషన్ అయ్యాక.. ప్లాంట్ వివరాల్ని పోర్టల్‌లో సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేయాలి.
నెట్ మీటర్ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. డిస్కమ్ అధికారులు తనిఖీలు చేసి.. తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
ఈ రిపోర్ట్ పొందాక.. మీ బ్యాంక్ డీటెయిల్స్ సహా క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్లో సబ్మిట్ చేస్తే.. 30 రోజుల్లోగా సబ్సిడీ మీ అకౌంట్‌లో జమవుతుంది.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *