ఆయన ఓ తహసీల్దారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలి. కానీ, ఆ తహసీల్దార్ పూటుగా తాగి, హాయిగా నిద్రపోయారు. ఈ ఘటన విజయనగరం జిల్లా వంగర మండలంలో (vangara mro) చోటు చేసుకుంది. ఈ విషయం బయటకు రావడంతో కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే : ఓ వైపు తహసీల్దార్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకుందామని ప్రజలు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఎంతకీ సార్ దర్శనం కలగట్లేదు. ఆయన తీరిక లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎమ్మార్వో మాత్రం ఫుల్‌గా తాగి ఆఫీసులోనే నిద్రపోతున్నారు. ఇదిలా కొనసాగుతూనే ఉంది. వివిధ పనులపై ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చిన ప్రజలకు సిబ్బంది అబద్దాలు చెప్పి ఆయన లేనట్లుగా నమ్మిస్తున్నారు. ఎక్కడని అడిగితే క్షేత్ర పర్యటన అంటారు.
ఇదిలా ఉండగా తహసీల్దారు హరిరమణారావు (vangara mro hari ramanarao) నిన్న మధ్యాహ్నం మద్యం తాగి నేలపై ఆఫీస్‌లోనే నిద్రపోయారు. తమ సిబ్బందికి చెప్పి, గది బయట తాళాలు వేయించారు. తమ పనుల నిమిత్తం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన ప్రజలు తహసీల్దారు ఎక్కడని అడిగితే క్షేత్ర పర్యటనకు వెళ్లారని సమాధానం చెప్పారు. ఒవ వ్యక్తి కిటికీలో నుంచి లోపలికి చూడగా ఆయన నేలపై పడుకుని ఉండటం గుర్తించారు. అతను వెంటనే ఈ విషయం గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు. జనమంతా అక్కడికి చేరుకున్నారు.
చాలా రోజుల నుంచే ఆరోపణలు: స్థానికుల ఒత్తిడి మేరకు సిబ్బంది వెంటనే తాళాలు తీశారు. తహసీల్దారు మద్యం మత్తులో ఉండి లేవలేని స్థితిలో ఊగుతూ పాట్లు పడుతూ తన సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి కింద పడిపోయారు. మీడియా అక్కడకు చేరుకుని తహసీల్దారును ప్రశ్నించగా విధి నిర్వహణలో అలసిపోయినట్లు సమాధానం ఇచ్చారు. ఇంతలో వీఆర్‌ఏ ఉదయ్‌కుమార్ అక్కడికి చేరుకుని ద్విచక్రవాహనంపై ఆయన్ను తీసుకెళ్లిపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు.
ఈ విషయాన్ని ఆర్డీవో ఆశయ్య వద్ద ప్రస్తావించగా చాలా రోజుల నుంచి ఆ అధికారిపై ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని, మద్యం తాగి విధులకు రావడం నేరమన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, చర్యలు చేపడతామని పేర్కొన్నట్లు సమాచారం.
సస్పెండ్: వంగర ఎమ్మార్వో రమణారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధి నిర్వహణలో ఉండి మద్యం తాగి కార్యాలయంలో నిద్రించారు. సదరు ఎమ్మార్వో నిర్వాకం వీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు రమణారావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.