జవహర్ నవోదయ విద్యాలయం(Jawahar Navodaya Vidyalaya)లో ప్రవేశం లభిస్తే ఇంటర్మీడియట్ వరకు మంచి విద్య లభిస్తుందని వేలాది మంది విద్యార్థులు ఏటా పోటీ పడుతుంటారు. సీటు వస్తే పిల్లల భవిష్యత్తుకు డోకా ఉండదని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎప్పుడు ప్రవేశ ప్రకటన వస్తుందా? అంటూ ఎదురుచూస్తూ శిక్షణ ఇస్తుంటారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ పరీక్షకు ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం.
విశాఖలోని కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయంలో (Jawahar Navodaya Vidyalaya Kommadi) 80 సీట్లున్నాయి. 2026-27కి ఆరోతరగతిలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల ఐదోతరగతి విద్యార్థులు ఇందుకు అర్హులు. ఈ నెల 29తో గడువు ముగియనుంది. కొమ్మాది నవోదయకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల విద్యార్థులే దరఖాస్తు చేయాలి. ఇక్కడ ఉచిత విద్య(Free Education)తో పాటు అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ప్రత్యేకత.
ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఇప్పటి వరకు మూడు జిల్లాల నుంచి 2,355 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతేడాది 9,088 దరఖాస్తులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఏటా జులైలో ప్రవేశ ప్రకటన, నవంబరు ఆఖరి వరకు దరఖాస్తుల స్వీకరణ, జనవరిలో ప్రవేశ పరీక్ష ఉండేది. ఈ సారి ముందుగానే ప్రకటన విడుదలైంది. ఆయా మార్పులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, ప్రధానోపాధ్యాయులు చొరవ చూపకపోవడం వంటివి దరఖాస్తులు తగ్గడానికి కారణంగా పలువురు భావిస్తున్నారు.
అందరితో దరఖాస్తు చేయించాలి: 5వ తరగతి చదువుతున్న 31,172 మంది విద్యార్థులంతా దరఖాస్తు చేసేలా పాఠశాలల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేస్తాంమని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. దీనిపై మండల విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. దరఖాస్తు చేయించి పరీక్ష రాయిస్తే ఇప్పటి నుంచే వారికి పోటీతత్వం అలవడుతుందన్నారు.
మారుమూల గ్రామాల నుంచి ఇంకా దరఖాస్తులు రావాల్సి ఉండటంతో గడువు పెంచాల్సిన అవసరముందని, దీనిపై కేంద్రానికి లేఖ రాశానని ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ గొండు సీతారాం పేర్కొన్నారు.