విజయనగరం: ఇండియన్ నేవీ మెరైన్ కమాండర్ (Indian Navy Marine Commando Govind)గా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందిన చందక గోవింద్ (30) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య స్వగ్రామంలో ముగిశాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన గోవింద్.. విశాఖపట్నంలో విధులు నిర్వర్తించేవారు. పారాచూట్ శిక్షణ నిమిత్తం కోల్‌కతా వెళ్లిన ఆయన.. అక్కడ ప్రమాదవశాత్తూ మృతిచెందారు. ఆయన భౌతికకాయం శుక్రవారం ఉదయం పెనుబర్తి గ్రామానికి చేరింది. అక్కడి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌లో సుమారు 10 కి.మీ దూరంలోని స్వగ్రామం పర్లకు చేర్చారు. అంబులెన్స్ వెంట పరిసర గ్రామాల ప్రజలు, యువత సుమారు వెయ్యి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
‘గోవింద్ అమర్ రహే’ అంటూ కన్నీటి వీడ్కోలు పలుకుతూ జరుగుడి, చీపురుపల్లి పట్టణాల మీదుగా ర్యాలీ సాగింది. స్వగ్రామానికి చేరుకున్న తర్వాత కుమారుడి మృతదేహాన్ని చూసి (Indian Navy Marine Commando Govind) తల్లి లక్ష్మి గుండెలు బాదుకుని రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టింది. అనంతరం గోవింద్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ నేవీ ఉన్నతాధికారులు, జిల్లా రిజర్వ్ పోలీసు అధికారులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. చీపురుపల్లి ఎస్సై ఎస్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసలు ఏం జరిగింది.. ఎలా జరిగింది:
పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో బుధవారం (ఏప్రిల్ 5) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ (Panagarh) ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు.
విశాఖపట్నం తీరంలో మొహరించిన ఐఎన్‌ఎస్ కర్ణ (INS Karna) నౌకలో ప్రత్యేక దళం ‘నేవీ మెరైన్ కమాండోస్ (Marcos)’కు గోవింద్‌ను అటాచ్ చేసినట్లు తూర్పు నౌకాదళం తెలిపింది. బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని బార్జోరాలో ఒక ఫ్యాక్టరీ గేటు వెలుపల గోధుమ రంగు జంప్ సూట్, హెల్మెట్‌లో గోవింద్ కనిపించారు. ఆయన తన భుజాలకు పారాచ్యూట్ ధరించి ఉన్నారు. అది పూర్తిగా తెరచుకోలేదని అధికారులు తెలిపారు.
తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం (IAF) తెలిపింది.
ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. ‘ఇది దురదృష్టకరమైన సంఘటన. ఘటనపై విచారణకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (CoI)ని ఏర్పాటు చేశా. సైనికుడు ధరించిన పారాచూట్ తెరుచుకోవడంలో విఫలమైందని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆయన తన ఎమర్జెన్సీ చూట్‌ను ఎంచుకొని ఉండవచ్చు. కానీ, అది కూడా పనిచేయకుండా ఉండవచ్చు’ అని నేవీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ‘బర్జోరా అనేది పనాఘర్ నుంచి కేవలం 20 కి.మీ దూరంలో ఉంది. కమాండో గోవింద్ అక్కడ ఎందుకు దిగారు అనే విషయంలో ఎలాంటి రహస్యం లేదు, అనుమానం లేదు’ అని సదరు అధికారి అన్నారు.
ప్రమాదానికి ముందు చివరి క్షణాలు వీడియోలో..
Indian Navy’s marine commando Chandaka Govind dies during para jump training on Wednesday. Govind was a native of the Vizianagaram district. #AndhraPradesh pic.twitter.com/jz0jcE0law
— Ashish (@KP_Aashish) April 6, 2023