విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలతో రాబోయే రోజుల్లో మత్స్యకారుల బ్రతుకులు ఆగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఉందని మత్స్యకారుల నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేసారు.
సముద్రం కోతకు గురై రోజురోజుకు ముందుకు రావడంతో ఇప్పటికే మత్స్యకారులు ఆందోళన చెందుతుంటే, ఒకపక్క బ్లాక్ శాండ్ మైనింగ్ పేరిట తీరంలో ఉండే ఇసుకను తరలించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని గంటా నూకరాజు అన్నారు. ఇప్పటికే మత్స్య సంపద అంతంతమాత్రంగా ఉండటంతో కుదేలవుతున్న మత్స్యకారులు బ్రతుకుజీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన పరిస్థితులు దాపురించాయని అన్నారు. తీరంలో చేపట్టబోయే శాండ్ మైనింగ్ వలన తీర ప్రాంతం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇలా జరిగినట్లయితే ప్రకృతి వైపరీత్యాల నుండి తీరాన్ని కాపాడటం ఎవరితరం కాదని, దీనివలన అపారమైన ఆస్తినష్టం జరుగుతూ.. సముద్రం మీద ఆధారపడి జీవించే మత్స్యకారుల జీవితాలు తలక్రిందులయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే తీరం అంతా ఎక్కడికక్కడ వెలసిన కెమికల్ కంపెనీల వలన సముద్రం కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని, దీనికారణంగా అపారమైన నష్టం మత్స్యకారుల సొంతమైందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వానికి ఆదాయం అవసరం కానీ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, వారి జీవితాలకు ఆటంకాలు కలిగేవిధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని కేవలం ఆదాయమే ద్యేయంగా ఎందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వాలకు ప్రజల జీవన విధానాలతో సంబంధం లేదా..? అని ప్రశ్నించారు.
అదేవిధంగా బీచ్ డెవలప్మెంట్ పేరిటా తీరప్రాంతాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అదే జరిగినట్లయితే పర్యాటకులు సముద్ర తీరంలో కొంతసమయం గడపాలన్నా.. లేదా స్థానికులు బ్రతుకుతెరువు కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా ఆయొక్క సంస్థకు ప్రత్యేక రుసుములు చెల్లించి ఉండవలసి వస్తుందని ఆన్నారు. దీనివలన ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఇదంతా తీరం నుండి మత్స్యకారులను వెళ్లగొట్టే ప్రయత్నం తప్పా మరొకటి కాదని అన్నారు. తీర ప్రాంతంపై ప్రైవేటు సంస్థల అజమాయిషిని ఆపాలని, అలా కాని పక్షంలో ప్రజలనుండి ముఖ్యంగా మత్స్యకారుల నుండి తీవ్రమైన అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవల్సి ఉంటుందని గంటానూకరాజు అన్నారు.