విశాఖపట్నం: సింహాచలం (Simhachalam Temple) సిహాద్రిఅప్పన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాధారణంగా శనివారం రద్దీ ఎక్కువగా ఉంటుంది, దీనికితోడు భోగి కావడంతో ఉత్తరాంద్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనం క్యూ చేంతాడంత కాగా వీవీఐపీలకు సిఫార్సులపై జారీ చేసే అతిశ్రీఘ్రదర్శనం (రూ.300) వద్ద కూడా రద్దీ పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం ఒకే రీతిన రద్దీ కొనసాగింది. అతి శ్రీఘ్రదర్శనం టికెటు తీసుకున్న వారికి స్వామి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. కార్లు, ద్విచక్ర వాహనాల రద్దీని నియంత్రించడం ఒక దశలో పోలీసులకు కూడా సాధ్యపడలేదు. దీంతో సింహగిరి (Simhachalam Temple) ఘాట్‌రోడ్డులో, కొండదిగువ పాతగోశాల నుంచి పాత అడివివరం వరకు పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. భక్తుల రద్దీ కారణంగా శనివారం ఒక్కరోజే స్వామివారి ఖజానాకు సుమారు రూ.39.7 లక్షల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. అందులో సింహభాగం దర్శనాల టికెట్ల ద్వారా రూ.24.25 లక్షలు రాగా, రూ.15 లడ్డూ, రూ.10 పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 10.8 లక్షలు, కేశఖండన టికెట్ల ద్వారా రూ.1.46 లక్షలు, విరాళాల రూపంలో రూ.1.71 లక్షలు, పలు సేవల ద్వారా రూ. 70 వేలు, రవాణా విభాగం ద్వారా రూ. 68 వేలు సమకూరింది.