Chain Snatcher: కురపల్లిలో చైన్ స్నాచరును వెంటాడి పట్టుకున్న యువకుడు.. దొంగకు దేహశుద్ధి

admin
By admin 1.5k Views
2 Min Read

విశాఖపట్నం: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకుపోతున్న చైన్ స్నాచర్ (Chain Snatcher) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. భీమునిపట్నం మండలం మజ్జివలస గ్రామానికి చెందిన కాగితాల బంగారమ్మ (70) మంగళవారం పక్కనే ఉన్న కృష్ణంరాజు పేట గ్రామం వెళ్లి వస్తుండగా.. చైన్ స్నాచర్ ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుపోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో కురపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై దొంగను వెంబడించాడు. అయితే పద్మనాభం-మహారాజుపేట రోడ్డులో కురపల్లి మలుపు వద్ద చైన్ స్నాచర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయాడు. వెంటనే యువకుడు అతడ్ని పట్టుకొని దొంగ.. దొంగ అని కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు విజయనగరం జిల్లా జామి మండలం, కుమరాం గ్రామానికి చెందిన పోలిపర్తి అమిత్లావు (29)గా గుర్తించారు.

ఇటీవలే ఇదే నిందితుడు పద్మనాభంలో చైన్ స్నాచింగుకు పాల్పడ్డాడు. ఆగస్టు ఒకటో తేదీన పద్మనాభం జంక్షన్ సమీపంలో సురాల పైడిరాజు అనే మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును ఇదే విధంగా అపహరించుకుపోయాడు. ఇదేకాక మరికొన్ని దొంగతనాలకు పాల్పడినట్లు క్రైం ఎస్ఐ ఆర్. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కోర్టు సమీపంలోని ఓ బైకు మెకానిక్ షోరూంలో నిందితుడు పని చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన పద్మనాభంలో, తాజాగా మజ్జివలసలోని దొంగతనాలు రెండూ మంగళవారమే జరిగాయి. వారం అంతా షోరూంలో పని చేసి వారాంతపు సెలవు రోజున ఇతడు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ నిందితుడు ఇప్పటివరకు ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడి ఎంత సొత్తు చోరీ చేశాడో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని క్రైం ఎస్ఐ ఆర్. మల్లేశ్వరరావు పేర్కొన్నారు.

/ Web Stories /

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kayadu lohar Latest Pics Viral #kayadu_lohar