విశాఖపట్నం / chain snaching: నగరంలో మంగళవారం గొలుసు దొంగలు (chain snaching) చెలరేగిపోయారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో నడిచి వెళ్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను తెంచుకుని పారియారు. ఈ మూడు ఘటనలు స్వల్ప వ్యవధిలోనే చోటుచేసుకోవడం గమనార్హం. అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి ప్రాంతానికి చెందిన రత్నావతి(55) వాకింగ్ చేస్తుండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న నాలుగున్నర తులాల తాలిబొట్టు, నల్లపూసలు తెంచుకుని పారిపోయారు. ఘటనలో రత్నావతి కింద పడిపోవడంతో మెడ, చేతికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పు డివిజన్ క్రైం సీఐ ఎర్రంనాయుడు, ఎస్‌ఐ ఖగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వాహనం నెంబరు ఆధారంగా విచారించగా శ్రీకాకుళానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని, మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. అయితే ఇంటి దగ్గర నిలిపి ఉంచిన వాహనాన్ని దుండగులు చోరీ చేసి గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించారు.
డాబాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన తాడి రమణమ్మ (56) సౌత్ జైలు రోడ్డు వద్ద గల ఓ బ్యాంకు ఏటీఎంలో నగదు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న తులంన్నర బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో నిందితులను గుర్తించలేదు. జ్ఞానాపురం శిలువ వీధి ప్రాంతానికి చెందిన సెయింట్ జోసెఫ్ బాలిక పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు పాఠశాలకు నడిచి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని యువకులు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు, బంగారు గొలుసు తెంపుకొని కంచరపాలెం మెట్టు వైపు పరారయ్యారు. ఘటనలో ఆమె కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. కంచరపాలెం క్రైం పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ విజయకుమార్ తెలిపారు.