విశాఖలో అక్రమ పశుమాంసం విదేశాలకు ఎగుమతి (beef export racket) చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను సిటీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో 189 టన్నుల అక్రమ మాంసాన్ని స్వాధీనం చేసుకుని, పలువురు కీలక నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ–1 డీసీపీ మణికంఠ వెల్లడించారు.
కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు
దేశవ్యాప్తంగా ప్రధాన పోర్టుల్లో అక్రమ ఎగుమతులపై నిఘా పెంచిన నేపథ్యంలో, పశుసంవర్ధక శాఖకు అందిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పోలీసులు ఆనందపురం పరిధిలోని ఒక కోల్డ్ స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించారు.
అక్కడ విదేశాలకు ఎగుమతి చేసేందుకు నిల్వ ఉంచిన మాంసంపై అనుమానం రావడంతో నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.
ల్యాబ్ పరీక్షల్లో సంచలన నిజాలు
ల్యాబ్ పరీక్షలలో ఆవు మాంసం, ఎద్దు మాంసం, గేదె మాంసం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
కీలక నిందితుల అరెస్టు
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఫర్హాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇది పెద్ద స్థాయి అంతర్జాతీయ రాకెట్ అని తేలడంతో, ప్రధాన సరఫరాదారులైన మన్సూర్ అలీ (మహారాష్ట్ర – లోనావాలా) మరియు రషీద్ ఖురేషి (ఉత్తర్ ప్రదేశ్ – మీరట్)లను అరెస్టు చేశారు.
తప్పుడు ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, ఆరోగ్య ధ్రువపత్రాలు సృష్టించి విశాఖపట్నం పోర్టు ద్వారా అక్రమంగా పశు మాంసాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
పరారీలో మరికొందరు నిందితులు
ఈ రాకెట్‌కు సంబంధించి ఇంకా ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
189 టన్నుల మాంసం ధ్వంసం
కోర్టు అనుమతి మేరకు స్వాధీనం చేసుకున్న 189 టన్నుల మాంసాన్ని జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి, పశుసంరక్షణ శాఖ, రెవెన్యూ అధికారుల సమక్షంలో భద్రంగా పూడ్చివేసినట్లు డీసీపీ తెలిపారు.