Vishakapatnam News: జిల్లాలో రూ.5 కోట్లు విలువ చేసే గంజాయి, హాష్ ఆయిల్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో నమోదైన 529 కేసుల్లో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ.5,21,12,425 ఉంటుందని, పట్టుబడిన మాదకద్రవ్యాలను గంజాయి 10,147.590 కేజీలు, 19.31 లీటర్ల హాష్‌ఆయిల్, 1 కేజీ ఓపియంలను నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో పోలీసులు కాపులుప్పాడ డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి కేసులో అరెస్టైన వారి ఆస్తులను జప్తు చేస్తామన్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ గంజాయిని అరికట్టేందుకు 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వచ్చే బస్సులు, రైళ్లను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 15 నెలల్లో 14 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కళాశాలలో ఈగల్ టీమ్స్ ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ (సీపీ) శంఖభ్రత భాగ్చి, జిల్లా కలెక్టర్ ఎమ్‌ఎన్ హరేంధీర ప్రసాద్, ఐజీ రవి కృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.