అక్రమ సంబంధాల మోజులో భర్తలను భార్యలు హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సాంబారులో విషం కలిపి భర్తని హతమార్చిన (wife killed husband with poison with support of lover) ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్(35) ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య అమ్ముబీ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకొని, స్పృహ కోల్పోవడంతో కుటుంబీకులు సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఆయన రక్త నమూనాలు పరీక్షించి పురుగుమందు అవశేషాలు గుర్తించారు.
దీంతో రసూల్ కుటుంబీకులు ఆయన భార్యపై అనుమానంతో ఆమె సెల్‌ఫోన్ వాట్సప్ చాటింగ్ పరిశీలించగా అసలు విషయం భయటపడింది. ఆమె స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో చాట్ చేసినట్లు గుర్తించారు. అందులో.. ‘‘నువ్వు ఇచ్చిన విషం మొదట దానిమ్మ రసంలో కలిపా. దాన్ని నా భర్త తాగలేదు. దీంతో ఆహారంలో కలిపా’’ అని అమ్ముబీ పేర్కొంది. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రసూల్ మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అమ్ముబీ, లోకేశ్వరన్‌లను అరెస్టు చేశారు.