గొర్రెలు పెంపకానికి కోటి రుణం.. కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం

admin
By admin 1.3k Views
2 Min Read

గొర్రెలు పెంపకానికి కోటి రుణం.. కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం

గొర్రెలు, మేకల పెంపకం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది (National Livestock Mission). మాంసం ఉత్పత్తి పెంచడమే కాకుండా తద్వారా ఉపాధి కోసం ఎదురుచూసే వారికి ఆదాయం పెంపొందించడమే లక్ష్యంగా ఈ పధకాన్ని ప్రవేశపెట్టారు. గొర్లు, మేకల పెంపకానికి ఆసక్తి ఉన్న అన్ని రకాల సామాజిక వర్గాల వారి కోసం కేంద్ర పశు సంవర్ధక కార్యక్రమం (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్) ద్వారా రూ. కోటి యూనిట్ విలువ గల ఈ స్కీం అమలు చేస్తోంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ. 50 లక్షల వరకు రాయితీ కల్పిస్తోంది.

వ్యక్తిగతంగా గానీ.. సామూహికంగా గానీ.. సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయం సహాయక సంఘాల వారు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే గొల్ల, కురుముల ఆదాయ అభివృద్ధి కోసం గొర్రెల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో అన్ని సామాజిక వర్గాలకు ఈ రుణ పథకం అమలు చేస్తోంది.

దరఖాస్తు ఎలా ఇవ్వాలి.. ఎలా ఎంపిక చేస్తారు..

రూ. కోటి విలువైన యూనిట్‌లో 500 ఆడ మేకలు లేదా గొర్రెలు, 25 పోతుల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి పెంపకం కోసం ఎకరం నుంచి 5 ఎకరాల సొంత లేదా లీజు భూమి ఉండాలి. దాంట్లో షెడ్ నిర్మించే తీరు, గ్రాసం పెంచేచోటు, సొంత అడ్రస్, స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో ఆసక్తిదారులు www.nlm.udyamimitra.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇటీవలే ప్రారంభమైంది. పశు సంవర్ధక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు. ఈ స్కీం కింద ఎంపికైన వ్యక్తులు, సంఘాలకు కేంద్రం యూనిట్ విలువలో 50 శాతం రాయితీగా విడుదల చేస్తుంది. మరో 40 శాతం రుణం కోసం బ్యాంకులకు సిఫార్సు చేస్తుంది. లబ్ధిదారుడు తన వాటా కింద 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తీసుకునే గొర్రెల్ని బట్టి కూడా యూనిట్ విలువ నిర్దేశించారు. 105 మేకలు లేదా గొర్రెలు, 210, 315, 420 మేకలు/గొర్రెలతో కూడా యూనిట్లు ఉన్నాయి. వాటి సంఖ్య ఆధారంగా యూనిట్ విలువ నిర్ణయించి లబ్ధిదారులకు 50 శాతం రాయితీని రెండు విడతలుగా ఇస్తారు.

Share this Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *