విశాఖపట్నం: సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ (Simhachalam Giri Pradakshina)లో భాగంగా.. లక్షలాదిగా తరలివచ్చిన భక్త జనంతో అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీ రద్దీ నెలకొంది. రద్దీ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారంటూ పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తుస్తున్నారు. భారీ ఎత్తున భక్తులు వస్తారని తెలిసినప్పటికీ రోప్ పార్టీలు ఏర్పాటు చేయకపోవడంతో పోలీసు సిబ్బంది అక్కడ ఉన్నా రద్దీని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలి పావంచా వద్దకు భక్తులు ఎదురెదురుగా రావడంతో తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.
సింహగిరి ఘాట్ రోడ్డు వద్ద పోలీసుల నియంత్రణ లేకపోవడంతో బస్సులు దిగిన భక్తులు తొలి పావంచా వెనుక ప్రాంతంలో ఉన్న ఇరుకైన సందు నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. తక్షణమే తొలి పావంచా వద్ద పోలీసు రోప్ పార్టీలను ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించాలని భక్తులు కోరుతున్నారు.
వేపగుంట కూడలిలో నిలిచిన వాహనాల రాకపోకలు
మరోవైపు వేపగుంట కూడలిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువెళ్లాలో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వేపగుంట నుంచి నాయుడుతోట, చేములపల్లితో పాటు పెందుర్తి రోడ్డులో కృష్ణరాయపురం వరకు వాహనాలు నిలిచిపోయాయి.