Vinayaka mandapam Police Permissions: వినాయక చవితి (ganesh chaturthi 2025) ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి చలానా ఫీజులు లేకుండా వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు ఏపీ పోలీసులు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు జారీ చేస్తున్నారు. దీని ద్వారా వినాయకుడి మండపాల వద్ద క్యూఆర్ కోడ్ తప్పనిసరి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వినాయకుడి విగ్రహాలు, మండపాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ విండో పద్ధతిలో వేగంగానే అనుమతులు జారీ చేస్తున్నారు. https:///ganeshutsav.net అనే వెబ్‌సైట్ ద్వారా వినాయకుడి మండపాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. వెబ్‌సైట్లోకి వెళ్లి కమిటీ నాయకుడు లేదా దరఖాస్తుదారుని పేరు, పోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా, అసోసియేషన్ లేదా కమిటీ పేరు వంటి వివరాలను నమోదు చేయాలి.
అదేవిదంగా వినాయకుడి మండపం యొక్క స్థలం, వినాయకుడి విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వంటి వివరాలు తెలియజేయాలి. విగ్రహం ఏర్పాటుచేసే ప్రాంతం ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలతో పాటుగా.. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లను, వారి ఫోన్ నంబర్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనం ఏరోజు, ఎన్ని గంటలకు చేస్తారు, ఎలాంటి వాహనం వినియోగిస్తున్నారనే దానికి సంబంధించిన పూర్తి చేసి వివరాలు నమోదు చేసి దరఖాస్తును సమర్పించాలి.
ఈ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు. లేదా ఫోన్ చేసి వివరాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. దరఖాస్తు చేసిన తరువాత వచ్చే అనుమతి లెటర్ మరియు ఎన్‌వోసీ (NOC) కూడా ఆన్‌లైన్‌లోనే పొందాలి. ఎన్‌ఓసీతో పాటుగా నిబంధనలతో కూడిన క్యూఆర్‌కోడ్ వస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని.. లామినేషన్ చేయించి వినాయకుడి మండపంలో ఉంచాలి.
వినాయకుడి మండపం తనిఖీకి వచ్చే అధికారులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను పరిశీలిస్తారని అధికారులు చెప్తున్నారు. పోలీసుల అనుమతి లేకుండా గణేశుడి విగ్రహాలు, పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదు. అనుమతుల జారీ ప్రక్రియ పూర్తి ఉచితంగా చేపడుతున్నారు. అలాగే వినాయకుడి మండపాల ఏర్పాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై సందేహాలు ఉంటే.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదా మీ దగ్గరలోని ఇంటర్నెట్ సెంటర్ సంప్రదించి దరఖాస్తు చేసుకోండి.