ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీలో సబ్జెక్టులు ఉండిపోయిన (బ్యాక్‌లాగ్స్) విద్యార్థులకు మేలు చేసేలా ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. సాధారణ ఫీజు చెల్లించి ప్రత్యెక పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించబోతున్నారు. ఏయూ (AU) పరిధిలో 190కుపైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గత పదేళ్లలో ఆయా కాలేజీల్లో చదివిన పలువురు విద్యార్థులు వేర్వేరు కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. కొంతమందికి మూడు నుంచి పదికిపైగా సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. అటువంటి వారంతా అవకాశం లభిస్తే డిగ్రీ పూర్తిచేయాలని భావిస్తున్నారు.
అయితే, ఒక్కో సబ్జెక్టుకు రూ.15 వేలు ఫీజుగా గతంలో నిర్ణయించారు. అంటే ఒక్కో విద్యార్థి తనకు ఉన్న బ్యాక్‌లాగ్స్ బట్టి తగినంత ఫీజు చెల్లించాల్సి ఉండేది. అందుకే పెద్దగా ఎవరూ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో నామమాత్రపు ఫీజు చెల్లించి ఒకేసారి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు రాసుకునేందుకు అవకాశం కల్పించాలని తాజాగా వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల్లో షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ తెలిపారు. ఇది వందలాది మంది విద్యార్థులకు మేలు చేస్తుందన్నారు. ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజునే వసూలు చేయనున్నారు.
తత్కాల్ ఫీజు రద్దు:
యూనివర్సిటీ అధికారులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అత్యవసరంగా కావాలంటే ప్రస్తుతం నిర్ణీత రుసుము కంటే కొంచెం ఎక్కువ మొత్తం (తత్కాల్ పద్ధతి) వసూలు చేస్తున్నారు. తత్కాల్ విధానంలో సర్టిఫికెట్లను ఒకటి, రెండు రోజుల్లో ఇస్తున్నారు. అయితే, తత్కాల్ ఫీజు విద్యార్థులకు భారంగా మారుతుందని గ్రహించిన అధికారులు దానిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నిజంగానే అత్యవసరంగా సర్టిఫికెట్లు కావాల్సి వస్తే.. తత్కాల్ విధానంలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకరోజులో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలను ఇప్పటికే ఎగ్జామినేషన్ విభాగానికి ఇచ్చినట్టు వైస్ చాన్సలర్ వెల్లడించారు.