తెలంగాణలో నిరుద్యోగులకు త్వరోనే భారీ శుభవార్త లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని హోం శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం వివిధ విభాగాలు, కేటగిరీలలో కలిపి 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీటిలో కానిస్టేబుల్, ఎస్సై, ఇతర సాంకేతిక, పరిపాలనా పోస్టులు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒకేసారి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని నిరుద్యోగులు సైతం భావిస్తున్నారు.
ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి క్యాబినెట్ సబ్ కమిటీకి పంపినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఎస్సై పోస్టుల నియామకంలో మార్పు
ఇక సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల నియామక విధానంలో మార్పులు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జోనల్ స్థాయిలో ఉన్న ఈ పోస్టులను రాష్ట్ర స్థాయికి మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
త్వరలో నోటిఫికేషన్
క్యాబినెట్ సబ్ కమిటీ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి అంశాలతో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో తెలంగాణలో పోలీస్ మరియు హోంశాఖకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం కానుంది.