ఒడిశాలో ఇటీవలే ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ దారుణ ఘటన మరువకముందే ఒడిశాలోని ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గూడ్స్ రైలుకు చెందిన నిరూపయోగ బోగీ కిందపడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రైల్వే స్టేషన్‌లో కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. రైల్వే మరమ్మతులు చేయడానికి కార్మికులు రాగా.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో గూడ్స్ బోగీ కింద కార్మికులు తలదాచుకున్నారు. ఆ సమయంలో భారీ ఈదురుగాలులకు బోగీలు కదలడంతో చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కటక్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.