విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్ (Ayyanna Arrest) అయిన విషయం తెలిసిందే. ఈ అరెస్టుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా, తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజక వర్గ ఇంచార్జ్‌లు, పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు అరెస్టు (Ayyanna Arrest)ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయని, బలహీన వర్గాలు బ్రతకడానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. అచ్చెన్నాయుడుని కూడా ఇలాగే అరెస్టు చేశారని, ఆయనకు కరోనా అంటించి పంపించిందన్నారు.
కళా వెంకటరావు, పల్లా శ్రీనివాసరావు, సబ్బంహరి లాంటి వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా వారి ఆస్తుల ద్వంసానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా నిరసనలు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని అశోక్ గజపతి రాజు అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేసిందేమీలేదని విమర్శించారు. అభివృద్ధి చేస్తున్నామని చెపుతూ నాశనం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్టులు చేస్తున్నారని, తనను కూడా ఈ ప్రభుత్వం వదిలిపెడుతుందని తాను అనుకోవడం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు. అయ్యన్న తన ఇంటికి సంబంధించి హైకోర్టుకు ఫోర్జరీ పత్రాలు పెట్టారనే వంక పెట్టి అరెస్టులు చేయడం దారుణమన్నారు.