విశాఖపట్నం: పద్మనాభంలోని అనంతపద్మనాభ స్వామి (Anantha Sadmanabha Swamy) కళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు స్వామి వారి తెప్పోత్సవం (Anantha Sadmanabha Swamy Teppotsavam) నిర్వహించనున్నారు. స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు కన్నయ్య కోనేరును సిద్ధం చేశారు. ఉత్సవానికి అవసరమైన నావను విజయనగరం జిల్లా చింతలవలస నుంచి రప్పించారు. సుమారు 60 ఏళ్ల కిందటి వరకు పద్మనాభుని తెప్పోత్సవం సాగేదని, అనుకోని కారణాలతో ఆ తరువాత నుంచి నిర్వహించకపోవడంతో ఈ సారి తప్పనిసరిగా నిర్వహించాలని ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలం తరువాత తెప్పోత్సవం నిర్వహించనుండడంతో కనులారా వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు హాజరుకానున్నారు. కాగా ఉత్సవాన్ని నెల్లిమర్ల దుర్గా మహాపీఠానికి చెందిన శ్రవణ చైతన్యానంద చిన్నస్వామి ప్రారంభిస్తారు. కుంతీమాధవస్వామి ఆలయం నుంచి ఉభయ దేవేరులతో అనంతపద్మనాభుడు కోలాం, శక్తి నృత్యాలతో శోభాయాత్రగా బయలుదేరి, సాయంత్రం ఆరు గంటలకు కన్నయ్య కోనేరుకు చేరుకుంటారు. అనంతరం నావలోకి ఉత్సవ విగ్రహాలను చేర్చిన తరువాత తెప్పోత్సవం నిర్వహించనున్నారు. సుమారు 6దశబ్దాల క్రితం ఆగిపోయిన తెప్పోత్సవం ఈసంవత్సరం పునః ప్రారంభం కావడంతో మరింత నూతనోత్సాహంతో భక్తులు పెద్ద ఎత్తున తిలకించనున్నారు.
ఏ రోజు ఏ కార్యక్రమం:
మొదటి రోజు అయిన మార్చి రెండో తేదీన విశ్వేక్షణ పూజ, పుణ్యా హవాసనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి మూడవ తేదీన అనంతని కళ్యాణ ఉత్సవం, మార్చి 4న విశేష హెూమాలు, గ్రామ బలిహరణ, మంగళ శాసనము నిర్వహించారు. మార్చి 5వ తేదీన నేడు కన్నయ్య కోనేరులో తెప్పోత్సవం (Anantha Sadmanabha Swamy Teppotsavam) నిర్వహించనున్నారు. మార్చి ఆరవ తేదీన అనంత పద్మనాభం రథోత్సవం జరుగనుంది. మార్చి 7వ తేదీన పూర్ణాహుతి, చక్ర స్నానము, 8వ తేదీన స్వామివారికి పుష్పయోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ఈవో నానాజీ బాబు, పద్మనాభం ఎంపీపీ కే. రాంబాబు కోరారు.