శాకుంతలం సినిమా ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. సమంత కీలక పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ఎలా ఉందంటే?

 కాళిదాసు ర‌చించిన సంస్కృత నాట‌కం అభిజ్ఞాన శాకుంత‌లంలోని శ‌కుంత‌ల - దుష్యంతుల ప్రేమ‌కావ్యం అంద‌రికీ సుప‌రిచిత‌మే. అయితే ఈ ప్రేమకావ్యాన్ని చ‌దువుతున్న‌ప్పుడు క‌లిగే అనుభూతి.. తెర‌పై చూస్తున్న‌ప్పుడు ఏమాత్రం క‌ల‌గ‌దు.

నాసిర‌కమైన త్రీడీ హంగులు ఓ కార‌ణ‌మైతే.. న‌త్త‌న‌డ‌క‌న సాగే క‌థ‌నం, సంఘ‌ర్ష‌ణ లేమి మ‌రో కార‌ణం.

చిన్నారి శ‌కుంత‌ల‌ను ఓ ప‌క్షుల గుంపు క‌ణ్వాశ్ర‌మానికి తీసుకురావ‌డంతో క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. ఆ ఆశ్ర‌మ ప్రాంతం.. అందులోని జంతువులు, ప‌క్షులతో శ‌కుంత‌ల‌కు ఉన్న అనుబంధాలు ప‌రిచ‌యం చేస్తూ నెమ్మ‌దిగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు గుణ‌శేఖ‌ర్‌

దుష్యంతుడి పాత్ర ప‌రిచ‌య స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నా.. పేల‌వ‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్ వ‌ల్ల ఆ ఎపిసోడ్ తేలిపోయిన‌ట్ల‌నిపిస్తుంది. శ‌కుంత‌ల‌కు దుష్యంతుడు ఎదురుప‌డే స‌న్నివేశాల్ని చ‌క్క‌గా తీర్చిదిద్దుకున్నారు గుణ‌శేఖ‌ర్. కానీ, వాళ్లిద్దరూ ఒక్క‌టయ్యే క్ర‌మంలో వారి మధ్య ఉన్న ప్రేమ‌ను, కెమిస్ట్రీని మ‌న‌సుల‌కు హ‌త్తుకునేలా చూపించ‌లేక‌పోయారు.

క‌థ మ‌ధ్యలో వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా..  అసుర‌జాతి కాలానీముల  క‌థ‌ను, దుర్వాస మ‌హ‌ర్షి  క‌థ‌ను ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం  చేశారు గుణ‌శేఖ‌ర్‌. ఇవి ఈత‌రం ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి.

దుర్వాస మ‌హ‌ర్షి ఎంట్రీ క‌థ‌ను ఒక్క‌సారిగా మ‌లుపు తిప్పుతుంది. (Shaakuntalam review) ఆయ‌న ఎపిసోడ్‌తోనే విరామ‌మిచ్చిన తీరు మెప్పిస్తుంది. దుష్యంతుడి రాజ్యానికి శ‌కుంత‌ల వెళ్ల‌డం.. నిండు స‌భ‌లో ఆమె అవ‌మాన ప‌డ‌టం.. రాజ్య ప్ర‌జ‌లు ఆమెను రాళ్ల‌తో కొట్టి చంపే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో ద్వితీయార్ధం ఆరంభం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది

కానీ, ఆ త‌ర్వాత క‌థ కాస్త గాడి త‌ప్పుతుంది. శ‌కుంత‌ల - దుష్యంతుడు తిరిగి ఎలా క‌లిశార‌న్న విష‌యాన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌పైకి తీసుకురాలేక‌పోయారు ద‌ర్శ‌కుడు.  ముగింపునకు ముందు కాలానీముల‌తో దుష్యంతుడు త‌ల‌ప‌డే యాక్ష‌న్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు

ప‌తాక స‌న్నివేశాల్లో భ‌ర‌తుడిగా అల్లు అర్హ ఎంట్రీ.. దుష్యంతుడితో ఆమె వాద‌న మాత్రం ఆక‌ట్టుకుంటాయి.

శ‌కుంత‌ల పాత్ర‌కు న్యాయం చేసేందుకు స‌మంత శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మించింది. కానీ, ఆ పాత్ర ఆమెకెందుకో అంత‌గా సెట్ అవ‌లేద‌నిపిస్తుంది. త‌న సొంత‌ డ‌బ్బింగ్ కూడా అంత‌గా ఆక‌ట్టుకోదు. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్ని మాత్రం త‌న అనుభ‌వంతో పండించే ప్ర‌య‌త్నం చేసింది సామ్‌.

స‌చిన్‌, అన‌న్య‌, మ‌ధుబాల‌, జిషు సేన్ గుప్తా.. ఇలా తెర‌పై లెక్క‌కు మిక్కిలి పాత్ర‌లు క‌నిపిస్తాయి. కానీ, ఏదీ గుర్తుంచుకునే స్థాయిలో ఉండ‌దు. ప‌తాక స‌న్నివేశాల్లో అల్లు అర్హ (Allu arha) న‌ట‌న.. ఆమె ప‌లికే సంభాష‌ణ‌లు ముచ్చ‌ట‌గొలుపుతాయి.

అంద‌రికీ తెలిసిన శాకుంత‌ల - దుష్యంతుల ప్రేమ క‌థ‌ను తెర‌పై ఓ దృశ్య కావ్యంలా ఆవిష్క‌రించడంలో గుణ‌శేఖ‌ర్ ఆకట్టుకోలేకపోయారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో మ‌రింత‌ శ్ర‌ద్ధ వ‌హించాల్సింది. మ‌ణిశ‌ర్మ సంగీతం ప్రేక్ష‌కుల‌కు ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది.

బ‌లాలు: + స‌మంత న‌ట‌న; + మ‌ణిశ‌ర్మ సంగీతం; + విరామ‌, ప‌తాక స‌న్నివేశాలు బ‌ల‌హీన‌త‌లు: - నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం; - తెరపై సంఘ‌ర్ష‌ణ లేని ప్రేమ‌క‌థ‌ చివ‌రిగా: అభిజ్ఞాన ‘శాకుంతలం’.. పెద్దగా ఆక‌ట్టుకోని ‘సమంతలం’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.