స్మార్ట్‌ విలేజ్.. మరో స్మార్ట్ మోసానికి సిద్దమా.. !

smart village

విశాఖపట్నం/smart village: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, రైల్వేలో జూనియర్‌ అసిస్టెంట్‌, ఎన్‌హెచ్‌ఏఐటో సూపర్‌వైజర్‌ జాబ్‌….ఏది కోరుకుంటే అది అని జాయినింగ్‌ లెటర్‌ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగులను బురిడీ కొట్టించిన ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ (smart yojana welfare society – smart Village) ఘరానా మోసం మరవకముందే తాజాగా అదే సంస్థ కార్యాలయాల్లో ‘రూరల్‌ గ్రామీణ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ (Rural Grameen Development Society) పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించి నిరుద్యోగులకు నియామకపత్రాలు జారీ చేస్తున్నారు. విశాఖలోని మాకవరపాలెం మండలం పైడిపాల సెంటర్‌లో ఉన్న మామిడి తోటలో బుధవారం ఐదు మండలలాకు చెందిన నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం రోలుగుంటలో గతంలో ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ ఉన్న కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.

నర్సీపట్నంకు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిరుద్యోగులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన విషయం తెలిసిందే. జిల్లా ఏవో, మండల ఇన్‌చార్జి, మూడునాలుగు పంచాయతీలకు ఎగ్జిక్యూటివ్‌ అంటూ ఉద్యోగ నియామకపత్రాలు అందించాడు. అసిస్టెంట్‌కు నెలకు రూ.19,200లు, మిగిలిన కేడర్‌లకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం అంటూ తానిచ్చిన నియామక పత్రంలో పేర్కొన్నాడు. నిరుద్యోగులకు అనుమానం రాకుండా వుండేందుకు జిల్లా, మండల కేంద్రాల్లో కార్యాలయాలు తెరిచి హడావిడి చేశాడు. నియామక పత్రాలు అందుకున్న వారికి గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, ప్రాథమిక విద్యపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగించాడు.

వారికి తొలి నెలలో శిక్షణ పేరుతో కొంత మొత్తం వేతనం అందించాడు. తరువాత వాయిదాలు వేస్తూ రావడం… ఐదారు నెలలు దాటినా డబ్బులు ఇవ్వక పోవడంతో కొందరు అసిస్టెంట్లు మండల ఇన్‌చార్జులను నిలదీయడంతో సుధాకర్‌ మోసం బయటపడింది. ఉత్తరాంధ్రలోని ప్రతి మండలం నుంచి కనీసం 20 మంది చొప్పున బాధితులు వున్నారు. వీరి నుంచి రూ.లక్షన్నర మొదలు ఐదు లక్షల వరకు దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసినట్టు అప్పట్లో ప్రాథమిక ఆధారాల మేరకు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తరువాత అతనిని అరెస్టు చేశారు. అంతటితో ‘స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ’ (smart yojana welfare society) కథ ముగిసింది.

ఇక వర్తమానానికి వస్తే… ‘రూరల్‌ గ్రామీణ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ పేరుతో నర్సీపట్నం కేంద్రంగా నాలుగు రోజుల నుంచి నర్సీపట్నం, రోలుగుంట, మాకవరపాలెం తదితర మండలాల్లో నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకపత్రాలను జారీ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వ్యక్తులు గతంలో స్మార్ట్‌ వెల్ఫేర్‌ సొసైటీలో పనిచేసి, నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తులు కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 28వ తేదీన రోలుగుంటలో గతంలో స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ నడిపిన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. రోలుగుంట, నర్సీపట్నం, రావికమతం మండలాలకు చెందిన 80 మందికిపైగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఇక మాకవరపాలెం మండలం పైడిపాల సెంటర్‌లో ఉన్న ఒక మామిడి తోటలో బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు నాతవరం, నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట మండలాల నుంచి సుమారు 60 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో అత్యధికులు గతంలో స్మార్ట్‌ యోజన వెల్ఫేర్‌ సొసైటీ చేతిలో మోసపోయిన వారే కావడం గమనార్హం. అనంతరం అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఆరు నెలల ప్రొబేషనరీ పిరియడ్‌ కింద నియామకపత్రాలు జారీ చేశారు. నెలకు కట్టింగులు పోను రూ.13,196 జీతంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయని పేర్కొన్నారు.

అయితే ఉద్యోగం ఎక్కడ చేయాలి, విధులు ఏమిటి, కార్యాలయం ఎక్కడ వంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో కొందరు నిరుద్యోగులు మాకవరపాలెంలో పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ రామకృష్ణారావు సమావేశం వద్దకు చేరుకుని వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ‘రూరల్‌ గ్రామీణ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ వారిని పోలీసు స్టేషన్‌ రావాలని ఆదేశించారు.

Share this Article
Leave a comment