ఏడాదికి ఒకసారి మాత్రమే తెరిచే వెయ్యేళ్ల పురాతన శివాలయం

Maha Shivaratri: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 48 కిలోమీటర్ల దూరాన రాయ్‌సెన్‌ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శనివారం (నేడు) తెరుచుకోనుంది. ఏడాది పొడవునా మూసి ఉంచే ఈ ఆలయాన్ని మహా శివరాత్రి (Maha Shivaratri) రోజున మాత్రమే తెరవడం ప్రత్యేకత. వెయ్యి అడుగుల ఎత్తయిన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించగా.. పలువురు ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్‌ సేథీ సోమేశ్వరాలయం తాళం తీసి.. శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. ప్రస్తుతం పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు తెరుస్తారు. శనివారం నాటి పర్వదినానికి అధికారులు సన్నాహాలు చేసారు. ఈ ఏడాది కూడా అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. అయిదు క్వింటాళ్ల కిచిడీ, పండ్లను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

Share this Article
Leave a comment