కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం: రెండో తరగతి వరకు పరీక్షలు వద్దు

NEP - National Education Policy

రెండో తరగతి దాకా విద్యార్థులకు రాత పరీక్షల ద్వారా మూల్యాంకనం ఒత్తిడితో కూడిన అదనపు భారంగా ఉంటుందని, 3వ తరగతి నుంచి ఈ పరీక్షలు నిర్వహించవచ్చని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేంవర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ముసాయిదా సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జాతీయ విద్యావిధానం (NEP – National Education Policy) పరిధిలో జాతీయస్థాయి సిలబస్‌పై ఈ ఫ్రేంవర్క్‌ కమిటీ కసరత్తు పూర్తిచేసింది. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల మూల్యాంకనానికి రెండు విధానాలను కమిటీ సూచించింది. పిల్లల పరిశీలనలు, తమ అభ్యాస అనుభవంతో వారు రూపొందించే కళాకృతుల విశ్లేషణ ద్వారా ఓ అంచనాకు రావచ్చని పేర్కొంది. ‘‘విద్యార్థులు, వారి అభ్యాస పద్ధతుల్లో ఉండే వైవిధ్యాన్ని మూల్యాంకనం గుర్తించాలి. అభ్యాస ఫలితాన్ని, యోగ్యతను అంచనా వేయడానికి పలు మార్గాలు ఉంటాయి. వీటన్నిటినీ గుర్తించే సామర్థ్యం ఉపాధ్యాయులకు ఉండాలి. రికార్డింగు, డాక్యుమెంటేషను ద్వారా క్రమబద్ధమైన ఆధారాలు సేకరించి విద్యార్థుల ప్రగతి విశ్లేషణ జరగాలి. ఇదంతా విద్యార్థుల అభ్యాస ప్రక్రియలో సహజసిద్ధమైన కొనసాగింపుగా చేయాలి’’ అని వివరించారు.

3వ తరగతి నుంచి సన్నాహక దశగా పరిగణిస్తూ రాత పరీక్షలు నిర్వహించవచ్చని సిఫార్సు చేశారు. గురువారం ఈ ముసాయిదా (National Education Policy) ను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు.. ఇలా పలు వర్గాల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ సారథ్యంలోని ఎన్సీఎఫ్‌ కమిటీ 6 నుంచి 8 తరగతులను మధ్యదశగా గుర్తిస్తూ తరగతి గదుల్లోని అంచనా పద్ధతులపై మరికొన్ని సూచనలు చేసింది. ‘‘ప్రాజెక్టులు, చర్చలు, ప్రెజెంటేషన్లు, ప్రయోగాలు, పత్రికలు తదితరాలతో అభ్యాస అంచనా జరగాలి. ఈ దశలో ఓ క్రమ పద్ధతిలో జరిగే మూల్యాంకన పరీక్షలు విద్యార్థులకు ఉపయోగపడతాయి. రెండోదశలో (9 నుంచి 12వ తరగతి) సమగ్ర తరగతి గది మూల్యాంకనం సమర్థంగా సాధన  చేయాలి. ఈ దశలో విద్యార్థుల అభ్యాసంలో స్వీయ మూల్యాంకనం కీలకపాత్ర పోషిస్తుంది. బోర్డు పరీక్షలకు, ఇతర పోటీ పరీక్షలకు వారు సిద్ధం కావాలి’’ అని ముసాయిదా వివరించింది.

Share this Article
Leave a comment