చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్ళు భూగర్భంలో నీటి జాడను కనిపెడతాయా..? సైన్స్ ఏం చెబుతుంది?

Identifying Bore Point using coconut

చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్ళు, చేతిలో పుల్ల పట్టుకుని చూస్తె భూగర్భజల జాడలు నిజంగానే తెలుస్తాయా..?

చంద్రుడిపై నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకునేంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. నేటికీ భూగర్భంలో నీటి జాడ వెతికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చేతిలో కొబ్బరికాయ లేదా చెంబులో నీళ్ళు పట్టుకుని చూసే సంప్రదాయ పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపైనే ఆధారపడే రైతులకు భూగర్బ శాస్త్రవేత్తల(జియాలజిస్టులు)ను పిలిపించి తమ పొలాల్లో నీటిజాడలను కనుగొనే సమయం, స్తోమత ఉండవు. దీంతో, చాలా మంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించడానికి పొలాల్లో నీటి జాడ తెలిపే వారిని పిలిపించుకుంటారు. వాళ్లు పొలంలో ఎక్కడ నీటి వనరులు ఉన్నాయని చెబుతారో అక్కడ బోరు వేయించుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలా నీటి జాడ కనుగొనేందుకు కొబ్బరికాయ, వై ఆకారంలో ఉండే వేప పుల్ల, చెంబులో నీళ్లు లాంటివి ఉపయోగిస్తుంటారు. అసలు ఇలాంటి పద్ధతులు శాస్త్రీయమేనా? రైతులు, జియాలజిస్టులు ఏమంటున్నారు? వీరిని నమ్ముకుని బోర్లు వేయించుకున్న రైతులు ఏం చెబుతున్నారు. వాటిని ఎంత వరకూ నమ్మొచ్చు వంటి విషయాలను తెలుసుకుందాం. (Identifying bore point using coconut)

మూడు పద్ధతుల్లో నీటి జాడను గుర్తించవచ్చు..

వివిధ పద్ధతుల ద్వారా నీటి జాడలు గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. చిత్తూరు, తిరుపతిలో చాలా మంది రైతులకు ఆయన నీటి జాడను కనిపెట్టారు. రైతు పొలంలో నీటిజాడ కనిపెట్టేందుకు కొబ్బరికాయ, వై ఆకారంలో ఉండే వేపపుల్ల లేదా కానుగపుల్ల, నీళ్ల చెంబును ఆయన ఉపయోగిస్తుంటారు. కొబ్బరి పీచు వేళ్ల వైపు ఉండేలా అరచేతిలో కొబ్బరికాయను పట్టుకుంటారు. పొలంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ కొబ్బరికాయ నిట్టనిలువుగా నిలుస్తుందో అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు.
లేదంటే, వై ఆకారంలో ఉన్న వేపపుల్లను అరచేతుల్లో పెట్టుకుని ముందుకు నడుస్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుందని.. ఒకవేళ నీళ్లు ఎక్కువగా ఉంటే అది గిరగిరా తిరుగుతుందని చెబుతున్నారు. ఇక నీళ్ల చెంబు పద్ధతిలో.. ఎక్కడైతే చెంబులో నీళ్లు పక్కకు ఒలుకుతాయో అక్కడ నీళ్లు ఉన్నాయని బోరు వేయవచ్చని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. భూగర్భంలో వాటర్ లెవల్ ఫోర్సును బట్టి తెలుస్తుంది. కొబ్బరికాయ లేవడం బట్టి ఎన్ని అడుగుల్లో నీళ్లు ఉన్నాయో తెలుస్తుందని అంటున్నారు. జియాలజిస్టులు యంత్రాల ద్వారా చెక్ చేసినా ఎన్ని నీళ్లు పడతాయో సరిగ్గా చెప్పలేరని, కానీ తాను గుర్తించిన పాయింట్లలో 99 శాతం విజయవంతం అయ్యాయని సురేందర్ రెడ్డి చెప్పారు. పాతికేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నానన్నారు.

అవి అశాస్త్రీయ పద్ధతులు…

ఇలా కొబ్బరికాయ, వేపపుల్ల, నీళ్ల చెంబుతో నీటి జాడ గుర్తించే విధానాలను అన్‌సైంటిఫిక్ (అశాస్త్రీయ) అని తిరుపతికి చెందిన జియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ అండ్ మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి అంటున్నారు. “టెంకాయ లేదంటే ఉత్తరేణి పుల్ల, వేప పుల్ల, తర్వాత రేగి చెట్టు పుల్లలు తీసుకుని కొంతమంది నీటి జాడలు గుర్తిస్తూ ఉంటారు. వాళ్లు దాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే కిందికి ఉన్నది పైకి లేస్తుంది. అక్కడ నీళ్లు ఉన్నాయని, అక్కడ బోరు వేసుకోమని చెబుతారు. కానీ వీటిని అశాస్త్రీయ పద్ధతులుగా భావించాలి” అని ఆయన అన్నారు. కొంతమంది తమ చేతిలో జలరేఖ ఉందని, దేవుడు కలలో కనిపించి నీళ్లు ఎక్కడ పడతాయో తమకు చెప్పారని కూడా చెబుతుంటారన్నారు. కానీ, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మాత్రమే నీటి జాడను కచ్చితంగా గుర్తించగలమని చెప్పారు.

Identifying Bore Point using coconut

పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పుడు ఏ పద్ధతిని అనుసరించి చెప్పినా నీళ్లు పడతాయి. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చెప్పినా నీళ్లు పడతాయి. రైతులు ఆ పద్ధతులను నమ్మడానికి కారణం అదేనని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. నీళ్లు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో ఎలా వాటర్ పాయింట్ పెట్టినా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే కొన్ని ఛాలెంజింగ్ ప్రాంతాల్లో.. అంటే, వెయ్యి అడుగులు బోరు వేసినా నీళ్లు పడని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి చోట్ల ఏ పద్ధతిలో అయినా నీటి జాడలు గుర్తించడంలో విఫలమయ్యే అవకాశాలు ఉంటాయని సుబ్బారెడ్డి చెప్పారు.

అశాస్త్రీయ పద్ధతులు పక్కన పెడితే, భూగర్భంలో నీటి జాడలు వెతకడానికి సైంటిఫిక్, సెమీ సైంటిఫిక్ పద్ధతులు సమర్థమైనవని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ నీటి జాడ గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న శాస్త్రీయ పద్దతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటని ఆయన చెప్పారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలించినపుడు మనకు భూమి అడుగున పొరలు పొరలుగా ఉంటుంది. రాళ్లు, మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనా వేస్తాం. వచ్చే వాల్యూల ఆధారంగా ఒక గ్రాఫ్ గీసుకుంటాం. ఫలితాలు ఎక్కడైనా అనుకూలంగా వచ్చాయా లేదా అని చూసుకుని నీటి జాడలను నిర్దారించుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.

భూగర్భంలో నీటి జాడల లోతు తెలుసుకోవడానికి సాఫ్ట్‌‌వేర్స్‌ 

పెండ్యులం మెథడ్, ఎల్ రాడ్ మెథడ్లను సెమీ సైంటిఫిక్ పద్ధతులుగా సుబ్బారెడ్డి చెప్పారు. ఆ రెండు పద్ధతుల ద్వారా ఏ దిశలో నీటి జాడలు వెళ్తున్నాయనేది గుర్తించవచ్చని, కానీ ఎంత లోతులో నీళ్లు పడతాయో కచ్చితంగా చెప్పలేమన్నారు.

బయో ఇండికేటర్స్

నీటి జాడలు గుర్తించే ప్రయత్నాలు పూర్వీకుల నుంచే జరిగినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. భూమి భౌగోళిక లక్షణాలను బట్టి కూడా కొందరు నీటి జాడలు అంచనా వేస్తారని తెలిపారు. ‘‘హిందూ విశ్వాసాల ప్రకారం, వరాహ మిహిరుడు భూగర్భంలో నీటి వనరులను ఎలా గుర్తించవచ్చు అనేదానిపై ఒక గ్రంథం రాశాడు. జల అన్వేషణపై ఉన్న ఆ గ్రంథంలో బయో ఇండికేటర్స్ ప్రస్తావన ఉంది. వీటిలో ఊడగ, రెల్ల, మద్ది, తంగేడు లాంటి చెట్లు లాంటివి నీళ్లు ఉన్న చోట గుంపుగా ఉంటాయని పూర్వీకుల నుంచీ ఒక నమ్మకం బలంగా ఉంది. జియాలజిస్టులు కూడా ఇలాంటి సంకేతాలను అన్వేషిస్తుంటారని, అలాంటి ప్రాంతాల్లో నీళ్లు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. పుట్టలు ఉన్నచోట కూడా నీళ్లు పడతాయని చెబుతారు. ఇవి కొంతవరకూ నిరూపితం అయ్యాయి కూడా. పుట్టకు నీళ్లు ఏ దిశలో పడతాయి అనేది వాటిని సర్వే చేసే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. సెమీ సైంటిఫిక్ పద్ధతులతోపాటు, బయో ఇండికేటర్స్‌ని కూడా జియాలజిస్ట్ పరిగణనలోకి తీసుకుంటారని సుబ్బారెడ్డి చెప్పారు.

భూగర్భంలో నీటిని గుర్తించే టెక్నాలజీ 1910 నుంచి అభివృద్ధి చెందుతూ వస్తోందని, ఫ్లైట్‌లో వెళ్తూ కూడా కింద నీటి జాడలు ఎలా ఉన్నాయో తెలుసుకునే సర్వేలు అందుబాటులో ఉన్నాయి. చదువుకున్న వాళ్లు శాస్త్రీయ పద్ధతులను వంద శాతం నమ్మవచ్చని, కానీ అశాస్త్రీయ పద్ధతులకు ఒక కారణం ఉండదు కాబట్టి వాటిని నమ్మలేమని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జియాలజీ విభాగం హెడ్ డాక్టర్ సురేష్ చెప్పారు. ‘‘సైంటిఫిక్‌గా చేసి చూపిస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. జియో ఫిజికల్ మెథడ్, మ్యాగ్నెటిక్ మెథడ్స్, సీస్ మిక్ మెథడ్స్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్. ముఖ్యంగా భూమిలో నీటి జాడకోసం ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్ మెథడ్ ఎక్కువగా వాడతారు.’’

Share this Article
Leave a comment