భారత్ లో రూ.5000, 10,000 వేల నోట్లు

5000 rupees notes

Demonetization: డిమానిటైజేషన్.. ఆరున్నరేళ్ల క్రితం డిమానిటైజేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన తెలిసిందే. ఇప్పుడు భారతీయ కరెన్సీలో అత్యధికంగా అందుబాటులో ఉన్న రూ.2000 నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంటుండటంతో మళ్లీ చర్చ మొదలైంది. భారతదేశంలో ఇప్పటివరకు ముద్రించబడిన అత్యధిక విలువ నోటు 2000 రూపాయల నోటు అని అనుకుంటే మీరు పొరపాటే పడినట్లే.

ఆర్‌బీఐ ఇంతకుముందు రూ.5000, రూ.10,000 నోట్లను ముద్రించిన విషయం మీకు తెలుసా?. ఇవే ఇప్పటివరకు భారతదేశంలో ముద్రించబడిన అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లు. మరి ఆ చరిత్ర ఏంటో తెలుసుకోండి. భారతదేశంలో మొట్టమొదటి సారిగా రూ.10,000 నోటు 1938లో జారీ అయింది. 1946 జనవరిలో ఈ నోట్లను రద్దు చేశారు. మళ్లీ ఆర్‌బీఐ 1954లో తిరిగి రూ.10,000 నోటును తీసుకొచ్చింది. కానీ 1978లో శాశ్వతంగా రూ.10,000 నోటును రద్దు చేశారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ ప్రభుత్వం రూ.10,000 నోటును నిలిపివేయడానికి వ్యాపారుల లాభదాయకత కారణంగా చెప్పారు.

1947లో స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారతదేశంలో 5,000, 10,000 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్ల తర్వాత 1954లో దీన్ని ముద్రించారు. అదనంగా రూ.1,000 రూపాయల నోట్లను మళ్లీ చెలామణిలోకి తెచ్చారు. దాదాపు 24 ఏళ్లు భారతదేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఉపయోగించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1978లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 రూపాయల నోట్లను రద్దు చేసింది. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో నోట్ల రద్దు ప్రకటన వచ్చింది. ఆ సమయంలో పెద్ద నోట్లను విస్తృతంగా ఉపయోగించని కారణంగా మొరార్జీ దేశాయ్ చేసిన నోట్ల రద్దు ప్రకటన ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.

1976 మార్చి 31 నాటికి రూ.7,144 కోట్ల విలువైన నగదు చెలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇందులో రూ.1000 రూపాయల నోట్లు రూ.87.91 కోట్లు కావడం విశేషం. ఇది మొత్తం కరెన్సీలో 1.2 శాతం మాత్రమే. రూ.5,000 నోట్ల విలువ రూ. 22.90 కోట్లుగా, రూ.10,000 విలువైన నోట్లు రూ.1.26 కోట్లుగా ఉండేది. అంటే 1260 నోట్లు వాడుకలో ఉన్నాయి. మొత్తం కరెన్సీ నోట్ల కన్నా ఈ మూడు పెద్ద నోట్లు 2 శాతం లోపే ఉండేవి.

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హయాంలో రూ.5,000, రూ.10,000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ సిఫార్సు చేసింది. అప్పటి ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తర్వాత, రూ.5,000, రూ. 10,000 నోట్ల కన్నా రూ. 2,000 నోట్లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వాటిని కూడా రద్దు చేయడంతో తరవాత ఏ నోట్లు అందుబాటులోకి రానున్నాయో చూడాలి.

Share this Article
Leave a comment