ఆటలో ఓడిపోయిన తనను చూసి నవ్వారని.. ఓ వ్యక్తి వారిపై విచక్షణారహితంగా కాల్పులు (Gun Firing in Brezil) జరిపిన ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లోని మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్ హాల్ (Pool Hall)కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్ (బ్రెజిల్ కరెన్సీ)కు పందెం కాసి పూల్ గేమ్ (Pool Game)లో ఓడిపోయాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవవడంతో పూల్ హాల్లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.
దీంతో కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు (Gun Firing in Brezil) జరిపాడు. ఈ ఘటనలో పూల్ యజమాని సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.