విద్వoసాలకు చిరునామా వైకాపా ప్రభుత్వం..! ప్రశ్నిస్తే అరెస్టులా..?

Bharatshorts

Visakhapatnam: రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విద్వంసం చేసి, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. ఇదేంటి ఇలా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులపై , సామాన్య ప్రజలపై కేసులు పెట్టి ఎన్నాళ్లు భయపెడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో ఆందోళన పెరిగిందని అన్నారు. ఉపాధి అవకాశాలు లేక సామాన్యులు, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడే పరిస్థితి కల్పించారని అన్నారు. బ్రతకడానికి సరైన అవకాశాలు లేక యువత తప్పుదోవ పడుతుందని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా..? అని గంటా నూకరాజు ప్రశ్నించారు. అదీకాక ఈ మూడున్నర సంవత్సరాలలో విద్వoసం తప్ప ఎక్కడా ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా..? అని నిలదీశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు, అరెస్టులు, దాడులు చేయడం.. ఎన్నాళ్ళు ఈ పరిపాలన అని నిలదీశారు.

ప్రజలకు ఉపయోగ పడని, ప్రజల జీవన విధానం మెరుగుపడని ఈ ప్రభుత్వ పాలన అవసరమా..? అని అన్నారు. విశాఖపట్నానికే మణిపూసలాంటి ఋషికొండను బోడికొండగా మార్చారు. హై కోర్టు అభ్యంతరం చెప్పినా, పర్యావరణ శాస్త్రజ్నులు హెచ్చరించినా, ప్రతిపక్ష నాయకులు నిరసన తెలిపినా.. జిల్లా ప్రజలు వ్యతిరేకించినా ఎందుకు ఈ మొండిపట్టు. విశాఖపట్నాన్ని ఏమి చేద్దామని అనుకున్నారని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి చేసారు, ఎన్ని నిధులు కేటాయించారని అన్నారు. మీరు చేసిన తప్పుల నుండి ప్రజల ఆలోచనలను దారి మల్లించిందానికే మూడు రాజదానుల ఆట ఆడుతున్నారని ఉత్తరాంద్ర ప్రజలకు తెలియదా..? ప్రభుత్వం పాలన బాగుంటే, మీరు చేసింది మంచి అయితే ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టులు ఎందుకు, వారిపై కేసులు ఎందుకని అన్నారు. ఏ తప్పు చేయనప్పుడు ఋషికొండ ప్రాంతానికి ప్రతిపక్ష నాయకులు వస్తే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని గంటా నూకరాజు ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులు, బైండొవర్ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిందేమిటని అడిగారు.

రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం భారత రాజ్యాంగం నియమావలిని ఉల్లంగిస్తుందని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముందని అన్నారు. మీరనుకున్నట్లే మీరు పాదయాత్ర చేసే సమయంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటే పాదయాత్ర సజావుగా సాగేదా..? అని అడిగారు. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకులకు, ప్రజలకు ఉంది, కాదనడానికి మీరెవరు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జై అమరావతి అన్నారు, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటున్నారు. ఎవరు మాట తప్పారు.? ఎవరు మడమ తిప్పారని గంటా నూకరాజు ప్రశ్నించారు. ఉత్తరాంద్ర అభివృద్ధి అంటున్నారని, ఈ మూడున్నర సంవత్సరాలలో విద్వoసం తప్పా మరేమైనా అభివృద్ధి చేశారా..? అభివృద్ధి కోసం రాజదాని అంటున్నారని, విశాఖపట్నలో ఉండే 13 ప్రభుత్వ ఆస్తులను 16 వేల కోట్ల రూపాయలకు తనఖా పెట్టి అభివృద్ధి చేస్తామంటే జిల్లా ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు.

ప్రశాంతతకు నిలయంగా ఉండే ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విబేధాలకు తావులేపి, చిచ్చులు పెడుతున్నారని అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించి పాలన చేయాలని, ప్రతిపక్ష నాయకులను, ప్రజలను అనగదొక్కి పాలన చేస్తామంటే కుదరదని గంటా నూకరాజు అన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని పాలన చేస్తారని, ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయంలో మార్పులు రావాలని, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా మంచి ఆలోచనలు ఈ పాలకులకు రావాలని దేవుని కోరుకుంటున్నానని గంటా నూకరాజు అన్నారు.

Share this Article
2 Comments