సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం

విశాఖపట్నం: స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించడంలో భీమిలి జోనల్ అధికారులు విఫలమయ్యారని జీవిఎంసీ 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ సందర్బంగా భీమిలి జోనల్ కమీషనర్ ఎస్. వెంకటరమణకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజుతో కలసి స్థానికంగా పేరుకుపోయిన పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గంటా అప్పలకొండ, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా ఉండే సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారుల్లో స్పందన లేదని వాపోయారు. ఒక కార్పొరేటర్ గా నా దృష్టికి వచ్చిన సమస్యలను స్వయాన జోనల్ అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడం బాధాకరమని గంటా అప్పలకొండ అన్నారు.

కార్పొరేటర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమే ప్రశ్నించారు. వర్షం పడిందంటే చాలు బీచ్ రోడ్డులో ఉన్న ఉమర్ అలీసా ఆశ్రమం వద్ద రోడ్డు మీదకు ఎర్రమట్టి చేరడం, అదేవిధంగా ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద రోడ్డు మీదకు 2 లేక 3 అడుగుల వరకు నీరు చేరడం జరిగితుందని అన్నారు. దీని కారణంగా వాహనదారులు, బాటసారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బీచ్ లో టౌన్ ప్లానింగ్ అధికారుల కళ్ళుకప్పి గెడ్డలు మూసివేసి వేసిన లేవుట్స్ కారణంగా వర్షంనీరు వెళ్ళడానికి దారిలేక రోడ్డుమీదకు ఎర్రమట్టితో సహా నీరు వస్తుందని, అదేవిదంగా స్టేడియం వద్ద చుట్టుప్రక్కల కడుతున్న అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాల్లో కాలువలు లేక వర్షం పడితే నీరు రోడ్డుమీదకు వస్తుందని అన్నారు. ఈ రెండు సమస్యలపై టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

గత నెలలో పడిన బారీ వర్షాలకు బీచ్ లో ఉన్న గౌతమ్ బుద్ధుని విగ్రహం ప్రక్కకు ఒరిగి పడిపోయే స్థితిలో ఉందని, అదేవిదంగా భీమిలి పాత బస్టాండ్ వద్ద బస్సులు యు టర్న్ అయ్యే దగ్గర కాలువమీద ఉన్న పలకులు విరిగిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 3వ వార్డులో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని అన్నారు. నీటి సమస్య, సరైన శానిటేషన్ లేకపోవడం, కొన్ని చోట్ల చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయవలసి ఉందని వాటిని పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గండిబోయిన పోలిరాజు, కొక్కిరి అప్పన్న, సత్తరపు చిన్న వాసపిల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share this Article
1 Comment