Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి

ex cm kiran kumar reddy on bjp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి (ex cm), కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ( Kiran Kumar Reddy) భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్‌సింగ్‌, లక్ష్మణ్‌  సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని.. దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్‌ జోషి చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి (Kiran Kumar reddy)వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు భాజపా చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో కాషాయ పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే భాజపా బలీయమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు.

‘‘కాంగ్రెస్‌ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడింది. భాజపా ఎదిగేకొద్దీ కాంగ్రెస్‌ దిగజారుతూ వచ్చింది. పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసిందే సరైనదనే ధోరణి కాంగ్రెస్‌లో ఉంది. దేశ నిర్మాణం పట్ల భాజపా నాయకత్వంలో స్పష్టమైన అవగాహన ఉంది. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణన్న సంకల్పం భాజపాకు ఉంది. దేశం కోసం మోదీ, అమిత్‌షా కంకణబద్ధులై ఉన్నారు’’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు.

Share this Article
Leave a comment